తొలిసారిగా కెటిఆర్ కవిత కలసి ఒక సభలో పాల్గొనడం చూడముచ్చటగా నడిచినా ఈ సభలో వారి ప్రసంగాలూ ప్రశంసలు మాత్రం ఒక వ్యూహం ప్రకారమే వున్నాయి. రామన్న అందరికీ అన్నేనని, ఆయన లాటి సోదరుడు వుండటం తన అదృష్టమని కవిత కీర్తించారు. ఆయనను ఆశీర్వదించాలని కోరారు.ఇదంతా కాబోయే ముఖ్యమంత్రి ప్రచార ఘట్టంలా నడిచింది. ఇక కెటిఆర్ చెల్లిని కృత్రిమ గౌరవాలతో సంబోధించలేనన్నారు గాని తర్వాత పొగడ్తలు మాత్రం అంతకు వేయి రెట్లు ఎక్కువగా వున్నాయి. అభిమానంగా నాలుగు మాటలు చెప్పడం వేరు. దేశంలో పార్లమెంటులోనే ఆమె అతి గొప్ప ఉనన్యాసకురాలన్నట్టు మాట్లాడారు.ఇదంతా చూస్తే ఆయన ఉద్ధేశంలో కేంద్ర మంత్రి పదవికి అర్హతలను చెప్పినట్లు కనిపిస్తుంది. కవిత కూడా ఆ విధమైన ఆకాంక్షలు చాలాసార్లు వ్యక్తం చేశారు గనక ఇదేమీ ఆశ్చర్యం కాదు. కుటుంబ సభ్యులు రాజకీయాల్లో వున్నప్పుడు ఒకరి గురించి మరొకరు సరదాగాఏదైనా అనడం ప్రస్తావించడం మామూలుగా జరుగుతుంటుంది గాని పరివారంలో వారే పరస్పర పొగడ్తలతో రెచ్చిపోవడం కొంత విపరీతమే. పైగా తమను ఉద్యమమే తీర్చిదిద్దింది తప్ప తండ్రి కెసిఆర్ కాదని చెప్పడం అన్నిటికన్నా అతిశయోక్తి. నడిపింది ఈ స్థానంలో నిలిపిందీ ఇంకా పైకి తీసుకుపోవాలని చూస్తున్నదీ అన్నీ అంతా కేసిఆరే కదా!