పిల్లి మంచితనం గురించి ఎలుక సాక్ష్యం చెబితే చెల్లుతుందా? అసాధ్యం. అలాగే మహిళాలోకం మీద కేసీఆర్ కు ఉన్న అవ్యాజమైన ఆదరణ గురించి కూడా ఆయన కుమార్తె కవితక్క కితాబులిస్తే చెల్లుబాటు అవుతాయా? అని ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. అవును మరి తన కేబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించని కేసీఆర్ మహిళల పక్షపాతి అని ఎవరైనా అంటే జనం నవ్వుకుంటారు తప్ప ఎలా నమ్మగలరు?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా చురుగ్గా తాను కూడా పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ గురించి తెగ కితాబులు ఇచ్చారు. ఆయన మహిళా పక్షపాతి అని అందుకే డబుల్ బెడ్రూం ఇళ్లను మహిళల పేరిట ఇస్తున్నారని కవితక్క భాష్యం చెప్పారు. అయితే నిజానికి ప్రభుత్వం కేటాయించే సంక్షేమ పథకాలను మహిళల పేరిట కేటాయించడం తద్వారా కుటుంబాలకు ఆర్థికంగా స్థిరత్వంతో ఉండేలా చూడడం అనేది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభం అయింది. అప్పట్లోనే అలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు దానిని అనుసరిస్తున్నారు తప్ప ప్రారంభించలేదు.
అయితే నిజానికి రాజకీయాల్లో మహిళా శక్తిని కేసీఆర్ ఎంత చిన్నచూపు చూస్తున్నారన్న దానిపై చాలా విమర్శలుండగా కవిత ఇలా మహిళా పక్షపాతి అంటూ కితాబులివ్వడం హాస్యాస్పదంగా ఉంది. తన కేబినెట్ లో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వని సీఎంగా కేసీఆర్ ముద్ర వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇళ్లను కుటుంబాలను వదిలి పోరాడిన మహిళా శక్తి కూడా తక్కువైనదేమీ కాదు. అయితే తెలంగాణ రాష్ట్రం తొలి మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం లేకుండా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఈ విషయం పై తర్వాత్తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆయన పట్టించుకోలేదు. రాజకీయంగా మహిళల పట్ల ఆయన చిన్నచూపు నకు ఇది నిదర్శనం అని పలువురు అంటుంటారు.
మహిళ కేసీఆర్ మహిళా పక్షపాతి అంటే.. జనం నవ్వుకోకుండా ఏం చేస్తారు? మహిళా పక్షపాతం అంటే తన కూతురు నడిపే సంస్థకు బతుకమ్మ నిర్వహణకు కోట్ల రూపాయలు దోచిపెట్టడం, నిజామాబాద్ జిల్లా రాజకీయాలు మొత్తం తన కూతురు కనుసన్నల్లో జరిగేలా.. ఆమె సిఫారసులకే పట్టం కట్టడం మాత్రమే కాదు కదా.. అని కూడా పలువురు విమర్శిస్తున్నారు.