హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత పరమశివుడితో పోల్చారు. కేసీఆర్ భోళాశంకరుడిలా అడిగినవారికల్లా వరాలు ఇస్తాడని అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్గల్లో మన ఊరు – మన ఎంపీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఎంపీగా గెలిపించిన ప్రజల ఆశలను వమ్ముచేయకుండా ప్రతి సమస్యనూ తెలుసుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. వీలైనంతవరకు అన్ని గ్రామాలలో పర్యటించేందుకు ప్రణాళిక తయారుచేసుకున్నానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పల్లెల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని అన్నారు. గ్రామస్తుల సమస్యలన్నీ నమోదు చేసుకుని విడివిడిగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా కొందరు బీడీ కార్మికులు తమకు పెన్షన్ రావటంలేదని ఫిర్యాదు చేశారు. సమగ్ర సర్వే చేసినప్పుడు బీడీ కార్మికులు తమ వృత్తిని సరిగా చెప్పలేదని, కొందరు బీడీ కార్మికులు కాకపోయినా అయినట్లు రాయించుకున్నారని కవిత అన్నారు. సర్వేలో నమోదు అయినవారికే పెన్షన్లు వస్తున్నాయని చెప్పారు.