హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు సహకారం అందించటంలేదని, కొత్త రాష్ట్రం హక్కులకోసం పోరాడాల్సి వస్తోందని కవిత అన్నారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్రమోడి ఒక్కసారైనా రాష్ట్రానికి రాకపోవటం బాధాకరమని నిన్న ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మోడి కనీసం ఒకసారైనా తెలంగాణను సందర్శించకపోవటం ఆయన అవగాహనను సూచిస్తున్నదా లేక కొత్త రాష్ట్రం అభివృద్ధి మీద ఆయనకు ఆసక్తిలేదా అనేది తనకు అర్థం కావటంలేదని చెప్పారు. అనేక విదేశాలలో పర్యటిస్తున్న మోడి తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలను పట్టించుకోవటంలేదని అన్నారు. మోడి తెలంగాణ పర్యటనకు రాకపోవటంపట్ల రాష్ట్ర ప్రజలు బాధకు గురయ్యారా అన్న ప్రశ్నకు ఔనని చెప్పారు. చిన్న చిన్న విషయాలపై కూడా తెలంగాణ తన హక్కులకోసం కేంద్రం దగ్గర పోరాడాల్సి వస్తున్నదని అన్నారు. ఇదేమంత బాగనిపించటంలేదని, రాజ్యాంగ విభాగమైన రాష్ట్రాన్ని పద్ధతిగా గౌరవించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. హైకోర్ట్ విభజనపై కేంద్రం తన మాట నిలబెట్టుకోలేదని, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా సైతం ఇవ్వలేదని గుర్తు చేశారు.