గడచిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. భాజపా నేత ధర్మపురి అరవింద్ గెలిచారు. అయితే, లోక్ సభ ఎన్నికల ఓటమి తరువాత రాజకీయ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు మాజీ ఎంపీ కవిత. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఏ రకరమైన బాధ్యతలూ ఆమె తీసుకోలేదు. ఓటమి తరువాత సొంత నియోజక వర్గం నిజామాబాద్ లో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె వెళ్లడం లేదు. అయితే, ఇప్పుడు సొంత నియోజక వర్గం నుంచే మళ్లీ కార్యాచరణకు సిద్ధమౌతున్నట్టుగా తెరాస వర్గాలు చెబుతున్నాయి.
గడచిన లోక్ సభ ఎన్నికల్లో పసుపు రైతుల సమస్య ఎంత తీవ్రంగా మారిందో తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో, కేసీఆర్ సర్కారు మీద నిరసనతో వందలకుపైగా రైతులు ఎన్నికల్లో నామినేషన్లు వేసిన పరిస్థితి. అయితే, ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి భాజపా ఎంపీ అభ్యర్థిగా అరవింద్ హామీ ఇచ్చారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే, కేవలం ఐదు గంటల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి సమస్యలు తీరుస్తా అన్నారు. కానీ, ఎన్నికల్లో ఆయన గెలిచి దాదాపు రెండు నెలలు గడుస్తోంది. ఆ ఊసే ఇప్పుడు లేదు. దీంతో, పసుపు రైతులను సమీకరించి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ ధర్మపురి మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలకు తెరాస శ్రేణులు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఈ పోరాటానికి ఎంపీ కవిత నాయకత్వం వహించబోతున్నారని నిజామాబాద్ తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. ఏ పసుపు బోర్డుతో అయితే తెరాస ఓటమికి అస్త్రంగా భాజపా వాడుకుందో, ఇప్పుడు దాంతోనే భాజపా ఎంపీ మీద పోరాటం చేయాలని తెరాస వర్గాలు సిద్ధమౌతున్నాయని సమాచారం.
అయితే, ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే ధర్మపురి అరవింద్ కి సమాచారం ఉందని అంటున్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీని తాను మరచిపోలేదనీ, త్వరలోనే పసుపు బోర్డు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈలోగా లేనిపోని హడావుడి సృష్టించి రైతులను గందరగోళ పరచేందుకు తెరాస ప్రయత్నిస్తోందంటున్నారు. నిజానికి, రైతులంతా తమ పక్షాన ఉన్నారనీ, కొంతమంది తెరాస నాయకులే రైతుల అవతారమెత్తి నిరసన చేసేందుకు సిద్ధమౌతున్నారని అరవింద్ అన్నారు.