బీఆర్ఎస్ లో మరో పవర్ సెంటర్ తయారవుతోందా? కల్వకుంట్ల కవిత ఇక అసలు సిసలైన రాజకీయం మొదలుపెట్టాలనుకుంటున్నారా? తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ లతో సంబంధం లేకుండా, పార్టీపరంగా తన పరిధి దాటి మరీ ఆమె చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న బాన్సువాడలో పార్టీ మీటింగ్లో పాల్గొన్న కవిత.. పార్టీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు పింక్ బుక్ లో రాసిపెట్టండి..వారిలో ఒక్కరినీ కూడా వదిలిపెట్టనని కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఇది మరవకముందే మళ్లీ సంచలన ప్రకటన చేశారు. పార్టీని వీడి వెళ్లినవారిని మళ్లీ జాయిన్ చేసుకోబోమని ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రకటన అధ్యక్షుడో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ, కవిత తనే లీడ్ తీసుకొని ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
కొన్నాళ్లుగా కవిత బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారు. సొంతంగా రాజకీయ చారిష్మాను సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై పార్టీతో సంబంధం లేకుండా దీక్షలు, నిరసనలు చేపట్టిన కవిత..ఈ వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో సైలెంట్ అయ్యారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఆమె యాక్షన్ ప్లాన్ లేదనేది కాంగ్రెస్ వర్గాల విమర్శ. ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ వచ్చిన కవిత..కేంద్రంపై వాయిస్ రైజ్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో కవిత కేంద్రంతో కొట్లాటకు దిగబోరని అంటున్నారు.
కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉంటుందని, అందుకే పార్టీలో గ్రిప్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగా ఆమె అగ్రిసివ్ రాజకీయం చేయాలనుకుంటున్నారని, అందుకే కేటీఆర్ కంటే ముందుగా తనే కీలక ప్రకటనలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.