భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ను అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు.
ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని… అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు.
రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్ కు దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు.
యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మ రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు.