బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదహారో తేదీన ఈడీ ఎదుట మరోసారి హాజరు కానున్నారు. పదకొండో తేదీన ఆమె హాజరయిన ముందు రోజు మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. ఇప్పుడు పదిహేనో తేదీన కూడా మహిళా రిజర్వేషన్ల ఉద్యమం చేపట్టారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్హోటల్లో రౌండ్టేబుల్సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు పదిహేనో తేదీ అంటే బుధవారం ఉదయమే కవిత ఢిల్లీ చేరుకున్నారు. పదహారో తేదీన ఈడీ విచారణకు హాజరవుతారు. గత విచారణ సందర్భంగా అటు ఢిల్లీ.. ఇటు తెలంగాణ మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అరెస్ట్ చేస్తారని ఎక్కువ మంది నమ్మారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయనో.. మరో కారణమో కానీ విచారణ చేసి కవితను పంపేశారు. పదహారో తేదీన హాజరు కావాలని ఆదేశించారు. ఈ సారి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొంత మంది ఢిల్లీకి చేరుకోవచ్చు కానీ.. గతంలోలా కవితకు మద్దతుగా హంగామా చేయకపోవచ్చని భావిస్తున్నారు.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాదాపుగా అందర్నీ అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ గా సీబీఐ కవితను ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ ఆమెను ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. ఈ విషయాన్ని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అందుకే కవిత అరెస్ట్ విషయంలో ఈ సారి ఈడీ కఠిన నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒక వేళ కవితను అరెస్ట్ చేస్తే ఎలాంటి ఉద్యమం చేయాలో బీఆర్ఎస్ ఇప్పటికే ఓ కార్యాచరణ రెడీ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.