ఢిల్లీ లిక్కర్ స్కాముల్లో ఉన్న వైసీపీ నేతలు, వారి బంధు మిత్రులు అప్రూవర్లుగా మారడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు ఇప్పటి వరకూ రాజకీయం జరిగిందని అనుకున్నారు కానీ. .. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అనూహ్యంగా అప్రూవర్ గా మారడంతో.. ఇప్పుడు ప్లాన్ మారిపోయిందని కవితను కూడా బుక్ చేయడానికి జగన్ రెడ్డి ఎంపీ రెడీ అయిపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సౌత్ లాబీ నుంచి ముడుపులు అందడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకం. ఇక్కడ కేసు బలహీనం అయితే.. ఢిల్లీలో ఆప్ నేతలు కూడా బయటపడిపోతారు. అప్పుడు బీజేపీ లక్ష్యం దెబ్బతింటుంది. అందుకే.. ఇప్పుడు ఈడీ కొత్తగా దూకుడు ప్రారంభించిందని చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్ గా మారడం.. శరత్ చంద్రారెడ్డి అంతకు ముందే్ తన అప్రూవర్ పిటిషన్ ఆమోదింప చేసుకుని బెయిల్ పై బయటకు వచ్చి టీటీడీ బోర్డు మెంబర్ గా పదవి కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు అసలు విషయం బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
కవితను టార్గెట్ చేయడానికి జగన్ రెడ్డి సహకరిస్తున్నారని తెలియగానే బీఆర్ఎస్ నేతల ఆలోచనల్లోనూ మార్పు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసులు చాలా కాలం పాటు హైదరాబాద్ కు వెళ్లి కావాల్సిన వారిని ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేసేవారు. మార్గదర్శి విషయలో సోదాలు చేయడం.. రఘురామ లాంటి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వంటివి జరిగాయి. అయితే గత వారం మార్గదర్శికి చెందిన వారిని అరెస్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు వెంటపడి మరీ ఆపారు. ట్రాన్సిట్ వారెంట్ చూపించాల్సిందేనని చెప్పడంతో.. అది లేక వెనుదిగిరిపోయారు.
మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ పరిణామాలకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.