హైదరాబాద్: ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై నిప్పులు చెరుగుతున్న నిజీమాబాద్ ఎంపీ కవిత ఇవాళ ఆయనకు కృతజ్ఞతలు ప్రకటించారు. తెలంగాణలోని తొమ్మిది వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయంగా కేంద్ర ప్రభుత్వం రు.450 కోట్లను విడుదల చేసింది. దీనిపైనే కవిత ప్రధానమంత్రికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మోడి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారంటూ కవిత ఇటీవల అనేక సందర్భాలలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ ఫెడరలిజంతో కాకుండా కోఆపరేటివ్ ఫెడరలిజంతో ముందుకెళ్ళాలని కవిత నిన్నకాక మొన్న కూడా సూచించారు. అటువంటిది కేంద్రం ఇవాళ తెలంగాణకు ప్రత్యేక సాయం ప్రకటించటం, కవిత దానికిగానూ కృతజ్ఞతలు తెలపటంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి.