ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఏదో ఒక పదవితో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు మంత్రులు, మేనల్లుడు సంతోష్ ఎంపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార్తె కవిత ఒక్కరే ఏ పదవీ లేకుండా, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ జాగృతి యాక్టివ్ గానే ఉన్నా, ఆ కార్యక్రమాల్లో కూడా కవిత పెద్దగా కనిపించడం లేదు. గడచిన బతుకమ్మ పండుగల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనలేదు. అయితే, ఇప్పుడు ఆమెను రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారనే చర్చ తెరాస వర్గాల్లో జరుగుతోంది.
కేసీఆర్ సన్నిహిత నేతగా పేరున్న కె. కేశవరావు రాజ్యసభ పదవీ కాలం మార్చితో ముగుస్తోంది. అయితే, ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు వెళ్లిన ఆయన్ని కొనసాగించే ఆలోచనలో సీఎం లేరని సమాచారం. దాంతోపాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో… ఆయన స్థానంలో కవితకు అవకాశం ఇవ్వొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాగని కేకేని పక్కనపెట్టేయరనీ, ఆయన్ని శాసన మండలి ఛైర్మన్ ని చేసే ప్రతిపాదన ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ వస్తుంది. ఆయన పార్టీ మారిందే మంత్రి పదవి కోసం. మంత్రివర్గంలో కొన్ని సర్దుబాట్లు ఉంటాయనీ, ఆ క్రమంలో గుత్తాకి మంత్రి ఇస్తారనే ప్రచారం మొదలైంది. కాబట్టి, గుత్తా కేబినెట్లోకి వెళ్తే, ఆయన స్థానంలో కేకే మండలికి వెళ్తే, ఆ స్థానంలో కవితను రాజ్యసభకు పంపించే ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.
ఢిల్లీ స్థాయిలో తెరాస వాయిస్ ఈ మధ్య పెద్దగా వినిపించని పరిస్థితి ఉంది. కేసీఆర్ కి నమ్మకస్తుడిగా పేరున్న వినోద్ కుమార్ ఎంపీగా ఎన్నిక కాలేదు. దీంతో, కేంద్రంతోగానీ, భాజపాతోగానీ సంబందాలు నెరిపేందుకు సరైన నాయకులు ఎవ్వరూ లేరనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కవితను రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ లోటు తీరుతుందని అంటున్నారు. తన కుటుంబం నుంచి ఇప్పటికే సంతోష్ ఎంపీగా ఉన్నారు కదా, కవితను కూడా రాజ్యసభకు పంపిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశమూ లేకపోలేదు! అయితే, ఇలాంటి విమర్శల్ని కేసీఆర్ పెద్దగా ఖాతరు చేయరు కదా! కుటుంబ పాలన అనే విమర్శను పట్టించుకున్న రాజకీయ పార్టీలు ఏవున్నాయి చెప్పండి? ఏదేమైనా, ఇన్నాళ్లకు కవిత రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోందని తెరాస వర్గాలు అంటున్నాయి.