ఈడీనా..బోడీనా తేల్చుకుందాం రా అని కేసీఆర్ ఓ వైపు ఘీంకరిస్తున్నారు కానీ… ఆ ఈడీ ఇప్పుడు ఆయన కుమార్తె కవిత మీద విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఫైల్స్ అన్నీ .. ఈడీ చేతికి వెళ్లీ వెళ్లక ముందు బీజేపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి.. అసలు ఢిల్లీ లో స్కాం ఎలా జరిగిందో వివరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కవితనే మాస్టర్ అని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో శాశ్వత నివాస చిరునామా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై ను ముందు పెట్టి ఆమె ఈ లిక్కర్ స్కాంను నడిపించారని అంటున్నారు.
ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై.. బోయిన్పల్లి అభిషేక్ అనే వ్యక్తితోకలిసి రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ అభిషేక్ .. కవితకు సమీప బంధువు. ఈ లిక్కర్ డీల్స్‌లో కీలకంగా పిళ్లైతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ఉన్నారు. వారందరి పేర్లను ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ మీడియా ముందు పెట్టారు. అందరూ కవిత ఆదేశాల మేరకే డీల్స్ నిర్వహించారని.. మొత్తం ఆమే చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల నిర్వహణ ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందంటే.. ఈ లిక్కర్ సిండికేట్లే ఇచ్చాయని అంటున్నారు. అక్కడే తీగ లాగితే తెలంగాణలో తేలిందని చెబుతున్నారు. ఏ విధంగా చూసినా లిక్కర్ స్కాంలో కవిత నిండా మునిగిపోయారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంపీగా కూడా లేరు. అయితే కేసీఆర్‌కు తెలియకుండా కవిత ఇలాంటి స్కాంకు ప్లాన్ చేయరని.. కేసీఆర్‌కూ తెలిసని ఆయనను లాగేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే .. లిక్కర్ స్కాం వ్యవహారాలలో టీఆర్ఎస్ తీవ్రంగా ఇబ్బంది పడటం ఖాయంగా కనిపిస్తోది. ఈ పరిణామాలపై కవిత ఇంకా స్పందించలేదు. ఇందులో విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీలైన అరబిందో గ్రూప్ పేరు కూడా బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ కేసు ముందు ముందు చాలా సంచలనాలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.