నిజామాబాద్ నుంచి మరోసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత. ఎంపీగా ఓడిపోయినప్పటికీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక స్థానంలో ఆమె తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు. టీఆర్ఎస్ అసలు బలం 505 మంది మాత్రమే. కానీ ఓట్లు మాత్రం 123 ఎక్కువ వచ్చాయి. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకుండా ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహించారు.
వాస్తవానికి రెండు పార్టీలకు సంబంధించిన స్థానిక ప్రజా ప్రతినిధులు 120 వరకూ ఉన్నారు. వారితోనూ అనుకూలంగా ఓట్లు వేయించుకోవడంలోఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. ముందు నుంచీ కవిత గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే ఎంత మెజార్టీ వస్తుందన్నదానిపైనే ఉత్కంఠ ఏర్పడింది. కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి 56 ఓట్లు రాగా.. కాంగ్రెస్కు 29 మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీలు డిపాజిట్లు కోల్పోయాయి.
కవిత గెలుపుతో ఇప్పుడు .. ఆమెకు మరో ప్రాధాన్య పదవి దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నిక వాయిదా పడకపోతే.. ఈ పాటికి ఎమ్మెల్సీగా ఎన్నికయి ఉండేవారే. కేసీఆర్ ఇవ్వాలనుకున్న కీలక పదవి ఇచ్చేవారే. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆమెకు దక్కబోయే కీలక పదవి ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. కాబోయే మంత్రి కవిత అని కొంత మంది నిజామాబాద్ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు. అయితే మంత్రి పదవి ఇస్తారా లేకపోతే మరొకటా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.