ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఐదుగురు సభ్యుల బృందం ఉదయం పదకొండు గంటలకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వచ్చింది. ఏడున్నర గంటల పాటు ఏకధాటిగా ప్రశ్నించారు. వారు వెళ్లిపోయిన తర్వాత కవిత నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు . బహుశా వారు అడిగిన అంశాలు… తాను ఇచ్చిన సమాధానాలు.. వాటిపై సీబీఐ ఎలాంటి అడుగులు వేసే అవకాశం ఉందో.. న్యాయనిపుణులతో కేసీఆర్ తో కలిసి కవిత చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
విచారణలో ఏమి అడిగారన్నదానిపై క్లారిటీ లేదు. సీబీఐ సమాచారం బయటకు రానివ్వలేదు. కానీ ఈడీ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారన్న రిమాండ్ రిపోర్టుపైనే ఎక్కువగా ప్రశ్నించారని చెబుతున్నారు. ఇంతటితో విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీజేపీ ప్రధానంగా కవితనే టార్గెట్ చేస్తోంది. అంటే ఇప్పుడు సాక్షి మాత్రమేనని.. తర్వాత నిందితురాలిగా మారుస్తారన్న అనుమానాలూ కొంత మందిలో ఉన్నాయి.
కవితను బీజేపీ టార్గెట్ చేసినట్లుగా కేసీఆర్ స్పష్టమైన అంచనాకు రావడంతో బీజేపీపై ఇప్పటికే సిట్ ద్వారా ఎదురుదాడి చేస్తున్నారు. అయితే సిట్ అనుకున్నంతగా ముందడుగు వేయలేకపోతోంది. ముగ్గురు నిందితులు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఇతర నిందితుల్ని కనీసం విచారణకు కూడా పిలువలేకపోయారు. దీంతో ఈ కేసుల్లో తదుపరి ఏం జరుగుతుదంన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.