ముఖ్యమంత్రి కుమార్తె, లోక్ సభ మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఖరారైనట్లే. కవితకు తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారం మాత్రం వాస్తవ రూపం తీసుకోదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ముఖ్యమంత్రి తన కుమార్తె కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇవ్వరని అంటున్నారు. నిజానికి కల్వకుంట్ల కవిత తనను రాజ్యసభ సభ్యురాలు చేయాలని ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ డిమాండ్ కు కుటుంబ సభ్యుల నుంచి కూడా ముఖ్యంగా తన తల్లి నుంచి మద్దతు కూడగట్టారు. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు తన కుటుంబంపై ఉన్న తన వారికే పదవులు అనే మచ్చ పోగొట్టుకునేందుకు కేసీఆర్ తన కుమార్తెకు రాజ్యసభ పదవి ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఆ సమయంలోనే ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపుతానని, దీనిని అడ్డం పెట్టుకుని మంత్రి పదవి ఆశిస్తే మాత్రం తగదని కుమార్తె కల్వకుంట్ల కవితకు షరతు విధించినట్లు సమాచారం. తెలంగాణలో తమకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతోనే కవితకు మంత్రి పదవి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బిజెపి తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇప్పుడు కవితను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని కమలనాథులకు మరో అవకాశం ఇవ్వడం తనకు ఇష్టం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.