బీఆర్ఎస్ వారసురాలు కవిత ఇక రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుకుగా మారనున్నారు. ఆమె జగిత్యాల బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే.కానీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన కోసం ఎన్నికల సమయంలో కవిత విస్తృతంగా పర్యటించేవారు. ఓ రకంగా అక్కడ సంజయ్ కుమార్ గెలుపు కవిత వ్యక్తిగత గెలుపుగా భావించేవారు. కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంజయ్ కుమార్ పార్టీ మారుతారని ఎవరూ అనుకోలేదు.
పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ కూడా పట్టించుకోవడం మానేసింది. కవిత జైలుకెళ్లడం, విడుదలైన తర్వాత రాజకీయంగా సైలెంటుగా ఉండటంతో జగిత్యాల బీఆర్ఎస్ క్యాడర్ చెల్లా చెదురు అయ్యే పరిస్థితి కనిపించింది.కానీ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగాలని కవిత నిర్ణయించుకున్నారు. పార్టీని బలోపేతం చేయనున్నారు. సహజంగా సంజయ్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లిన క్యాడర్ అక్కడ సర్దుకుపోయే అవకాశం లేదు.
కాంగ్రెస్ తరపున సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. సంజయ్ కుమార్ తో సర్దుకుపోయేందుకు ఆయన సిద్దంగా లేరు. ఇప్పటికే చాలా రచ్చ చేశారు. అందుకే మంచి నాయకత్వం ఉంటే బీఆర్ఎస్ క్యాడర్ అంతా మళ్లీ తిరిగి వస్తుంది. కవిత రాకతో జగిత్యాల బీఆర్ఎస్ లో ఉత్సాహం కనిపిస్తోంది.