ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇరవయ్యో తేదీన రావాలని ఈడీ ఇంతకు ముందే నోటీసులు జారీ చేయడంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ చేరుకున్నారు. ఆమె తో పాటు మంత్రి కేటీఆర్ , ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీ వెళ్లారు. విచారణకు హాజరవ్వాలనే ఆలోచనతోనే డిల్లీకి వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇరవై నాలుగో తేదీన సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కవిత విచారణకు సహకరిస్తున్నారా లేదా అన్న సందేహం ధర్మాసనానికి వస్తే… ఈడీ సహకరించడం లేదని … రెండు సార్లు నోటీసులు జారీ చేసినా హాజురు కాలేదని చెబుతుంది. అదే జరిగితే ఇలా విచారణకు సహకరించని నిందితులకు కోర్టు మినహాయింపులివ్వడం కష్టం. ఈ విషయాన్ని న్యాయనిపుణులు చెప్పడంతోనే విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ స్పందించింది. ఆమె పిటిషన్పై తమ వాదనలు వినకుండా ఎటువంటి ముందస్తు ఆదేశాలు జారీ చేయవద్దంటూ ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత తన పిటిషన్లో ఈడీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళనైన తనను కార్యాలయానికి పిలిపించడం, రాత్రి 8.30 గంటల వరకు కూర్చోబెట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు థర్డ్ డిగ్రీ పద్ధతులు అవలంబిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.