హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి, టీడీపీకి సంబంధాలు సరిగా లేవని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బలపడాలని తెలుగుదేశం కోరుకోవటంలేదని చెప్పారు. కావూరి ఇవాళ కర్నూలులో మీడియాతో మాట్లాడారు. కేంద్రంనుంచి వచ్చే నిధులతో టీడీపీ కార్యకర్తలే లబ్ది పొందుతున్నారని అన్నారు. ఏపీ రాజధానికి ఈ నెల 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపీకి ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందని కావూరి చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీటిని ముందుగా రాయలసీమ ప్రాజెక్ట్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల అవసరాలు తీరిన తర్వాతే శ్రీశైలం నీటిని ఆంధ్రాప్రాంతానికి కేటాయించాలని అన్నారు. లేనిపక్షంలో రాయలసీమలో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం దీనిని గుర్తించి చర్యలు చేపట్టాలని కావూరి సూచించారు.