అవును… ఈసారి ఐపీఎల్ అసలు విజేత కావ్య మారనే. హైదరాబాదీలు ఆత్మీయంగా పిలుచుకునే కావ్య పాపే. ఆటలో గెలుపోటములు సహజమే అయినా, ప్రతి క్షణం తన టీం గెలుపు కోసం ఆరాటపడ్డది కావ్య.
లెక్క లేనంత డబ్బు ఉండొచ్చు… వందలాది బిజినెస్ లల్లో ఇదీ ఒకటి కావచ్చు. కానీ, ఓడిపోతే కన్నీరు కార్చేంత ప్రేమ ఉందంటే ఆటను, తన టీంను ఎంత ప్రేమించి ఉండొచ్చు.
ఐపీఎల్ అంటేనే సరదా. ఎంతో మంది డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ ఓనర్లు… స్పాన్సర్స్… వేల కోట్ల బిజినెస్. కానీ, పోయిన చోటే వెతుక్కోవాలనుకున్న కావ్య పట్టుదలకు ఇప్పుడు అందరూ ముగ్ధులవుతున్నారు. హైదరాబాద్ అంటేనే వార్నర్, విలియమ్సన్ అనుకునే పరిస్థితులు ఉండే. ఎన్నో నిర్ణయాలు… పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాలు. కఠిన నిర్ణయాలపై సెటైర్లు కూడా వచ్చాయి. అంతేందుకు ఇప్పుడున్న కెప్టెన్ కమిన్స్ ను అత్యధిక ధరకు కొనుగోలు చేస్తే అవతలి టీం ఓనర్లు వెకిలి నవ్వులు కూడా నవ్వారు.
కానీ, తన పట్టుదల… టీం గెలవాలన్న తపన కావ్యలో ప్రతిక్షణం కనపడింది. టాస్ నుండి ఆఖరి బంతి వరకు ప్రతి మ్యాచ్ లో తన టీంతో ఉంది. సిక్స్ కొడితే ఎగిరి గంతేసింది. వికెట్ పడితే బాధ పడింది. టీం గెలిస్తే జట్టులో ఒకరిగా సంతోష పడింది. ఫైనల్ మ్యాచ్ లో ఓడితే కన్నీరు పెట్టింది.
తిట్టిన నోర్లతోనే పొగిడేట్లు చేసుకొని, హైదరాబాద్ టీం అంటే అల్లాటప్పా కాదు కప్ కొట్టే స్థాయి ఉందని నిరూపించటంలో కావ్య మారన్ కష్టం ఎక్కువే. ఈ సీజన్ లో రన్నరప్ గా నిలిచినా… కప్ గెలిచినంత సంతోషంగా ఉన్నారు ఫ్యాన్స్ అంటే టీంతో పాటు టీం కు వెన్నుదన్నుగా ఉన్న కావ్య మారన్ కూడా గెలిచినట్లే!