చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. హిట్ ఫెయిర్లకు ఎంత విలువ ఇస్తారో, ఫ్లాప్ హీరోయిన్ అంటే అంత భయపడిపోతారు. ఒక్కసారి ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడితే, ఆ కథానాయికకు అవకాశాలు రావడం కష్టమే. అయితే ఓ హీరోయిన్ మాత్రం వరుసగా ఫ్లాపులు కొడుతోంది. అయినా ఛాన్సులు వస్తున్నాయి. తనే… కావ్య థాపర్.
2018లో ‘ఈమాయ పేరేమిటో’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఆ సినిమా ఫ్లాప్. ఆ తరవాత `ఏక్ మినీ కథ`లో మెరిసింది. ఆ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. కాబట్టి హిట్, ఫ్లాప్ అనేవి పరిగణలోనికి తీసుకోలేం. ఇటీవల ఆమె వరుసగా ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు చేసింది. ఇందులో రెండు డిజాస్టర్లు. ‘ఊరు పేరు భైవరకోన’ యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు తను నటించిన ‘విశ్వం’ విడుదలైంది. ఇది కూడా ఫ్లాపు లిస్టులో చేరిపోయింది. అలా కావ్యపై ఐరెన్ లెగ్ ముద్ర మరింత స్ట్రాంగ్ గా పడిపోయింది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు ఆగలేదు. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలపై సంతకాలు చేసింది. తెలుగులో కథానాయికల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి కావ్యనే పెద్ద ఉదాహరణ. కథానాయికలు అందుబాటులో లేకపోవడడం ఒక కారణమైతే, గ్లామర్ డాల్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కావ్యకు ఎన్నో కొన్ని సినిమాలొస్తున్నాయి. అయితే కథేమిటి, తన పాత్రకున్న ప్రాధాన్యం ఏమిటి? అనే విషయాలపై కావ్య ఇప్పటికైనా దృష్టి పెడితే మంచిది. మరో ఫ్లాప్ తగిలితే… తన ప్రయాణం డెడ్ ఎండ్ కి వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని కావ్య లాంటి కథానాయికలు గుర్తు పెట్టుకోవాల్సిందే.