అసెంబ్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చాక, సీఎం కేసీఆర్ దృష్టంతా జాతీయ రాజకీయాల మీదే ఉంది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో మార్పులూ చేర్పులూ చేస్తున్నారు. దాన్లో భాగంగానే పార్టీ బాధ్యతలన్నీ తన రాజకీయ వారసుడు కేటీఆర్ కి కట్టబెట్టారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోయే అవకాశాలను కేటీఆర్ కి కల్పించి, తాను ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడతాననే సంకేతాలు కేసీఆర్ ఇచ్చినట్టే. అయితే, ఇదే సమయంలో… హరీష్ రావుకి సంబంధించిన ఒక కథనం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయం అవుతోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా హరీష్ రావును పోటీ చేయించే అవకాశం ఉందనీ, కేసీఆర్ ఆలోచన ఇదేనంటూ తెరాస వర్గాల్లో చర్చ ప్రారంభమైనట్టు సమాచారం. హరీష్ ను మెదక్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీకి దించి, తనని కేంద్రమంత్రిని చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తున్నారు కాబట్టి, తనకు తోడుగా హరీష్ రావు అవసరం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో హరీష్ అవసరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిచేయాల్సిన సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఆ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తించాలంటే హరీష్ కి మాత్రమే సాధ్యం. ఇంకోటి… కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే, రాష్ట్రంలో కేటీఆర్ కి తోడుగా హరీష్ ఉండాల్సిన అవసరం మరింత ఎక్కువ అవుతుంది. క్షేత్రస్థాయిలో ఆయనకి పార్టీపరంగా ఉన్న అనుభవం వేరు. ఉప ఎన్నికలు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీపరంగా హరీష్ పాత్ర ఎంత క్రియాశీలంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశాం. కొడంగల్ లాంటి కీలకమైన నియోజక వర్గాల విషయంలో హరీష్ వ్యూహాలు ఎంత పక్కాగా వర్కౌట్ అయ్యాయో తెలిసిందే.
ఈ కోణం నుంచి చూసుకుంటే రాష్ట్రస్థాయిలో హరీష్ సేవలు అటు పార్టీకీ, ఇటు ప్రభుత్వానికీ కూడా అవసరంగా కనిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పార్టీలో వినిపిస్తున్న ఈ గుసగుసల ప్రకారం చూసుకుంటే.. కేసీఆర్ ఆలోచన వేరేలా ఉండే అవకాశాల్నీ కొట్టి పారేయలేం. ఇంకోటి… పార్టీలో ఆధిపత్య పోరు, నంబర్ టు ఎవరు అనే చర్చకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడటంతోపాటు… స్పష్టత కూడా వచ్చేసింది. రాష్ట్రంలో కేటీఆర్ కి లైన్ క్లియర్ చేసేస్తూ… తనతోపాటు జాతీయ రాజకీయాలకు మేనల్లుడిని వెంటపెట్టుకుని కేసీఆర్ వెళ్తారనే చర్చపై సహజంగానే కొంత ఆసక్తి నెలకొంది. అయితే, దీనిపై తెరాస నేతలెవ్వరూ పెదవి విప్పకపోయినా.. పార్టీ వర్గాల్లో ఈ ఊహాగానం బలంగానే వినిపిస్తోంది.