కేసీఆర్.. ఈ మూడు అక్రరాలకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ మన కళ్ల ముందు ఉందంటే దానికి కారణం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రం భావన…పెరిగిపోయి ఇక ప్రత్యేక రాష్ట్రం అన్నది అసాధ్యం అన్న వాతావరణంలోఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని సొంత పార్టీ పెట్టుకున్నారు. సాహసోపేతమైన రాజకీయ అడుగు. ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీని పెట్టారని అంతే తప్ప.. తెలంగాణ కోసం కాదని కొంత మంది వాదిస్తారు. అందులో ఎంత నిజముందో కానీ ఆయన ఆ పార్టీ పెట్టడం వల్లనే ఈ రోజు తెలంగాణ అనే స్వప్నం సాకారం అయింది.
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది క్లిష్టమైన విషయం. అయినా ఎక్కడా దారి తప్పకుండా పోరాటం చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్ర భావన పెంచేలా ఎప్పటికప్పుడు ఉపఎన్నికలతో రాజకీయాలు చేశారు. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తిన్నారు కానీ ఆయన ఎప్పుడూ వెనుకబడిపోలేదు. ఓ సందర్బంగా రాజశేఖర్ రెడ్డి రాజకీయంతో పార్టీ ఆయన చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదంలో పడింది.కానీ ఆ తర్వాత రెండు నెలల్లనే ఉద్యమం ఆకాశమంత స్థాయికి తీసుకెళ్లారు. ఆమరణదీక్ష ప్రకటన తర్వాత కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయక తప్పలేదు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపుగా పదేళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. దశాబ్దాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించారు. తెలంగాణలోఎంతో దిగువన ప్రవహించే గోదావరిని ఎత్తిపోసుకవడానికి అన్ని చోట్లకు తరలించడానికి కాళేశ్వరం నిర్వహించారు. అదే కాళేశ్వరం ఇవాళ ప్లాన్ చేయాలంటే కనీసం ఐదు లక్షల కోట్లు అవుతుంది. ఇక పదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపరేఖలు మారిపోయాయి. విదేశీ నగరాల లుక్ వచ్చింది. పాలన విషయంలో…అభివృద్ధి విషయంలో కేసీఆర్ ది వంక పెట్టలేని పాలన అందించారు.
కేసీఆర్ అన్నింటిలోనూ వందకు వంద శాతం పర్ ఫెక్ట్ కాకపోవచ్చు. అలా ప్రతి విషయంలోనూ నూటికి నూరుశాతం కరెక్ట్ గా ఉండేవారు ఉండరు. ఆయన కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. రాజకీయాల్లో ఓటమిని ఓ రాజకీయ నాయకుడి వైఫల్యంగా చెప్పలేం. గత ఎన్నికల్లో కేసీఆర్..బీఆర్ఎస్ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల జరిగి ఉండవచ్చు కానీ.. ఈ కారణంగా ఆయన సాధించిన విజయాలను.. తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని తక్కువ చేయలేం. కేసీఆర్ కొడితే గట్టిగా కొట్టడం అలవాటని ఇటీవల చెప్పుకున్నారు. మరోసారి ప్రత్యర్థుల్ని ఆయన అలా కొట్టలేరని అనుకోలేం. అయితే కొట్టినా కొట్టకపోయినా కేసీఆర్ కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అథ్యాయం ఎప్పటికీ ఉంటుంది.
తెలంగాణ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.