అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీల ప్రచారం మంచి జోరుమీదుంది. టిక్కెట్ల కేటాయింపుల ప్రక్రియలు ముగింపు దశకు వచ్చేయడంతో, మూడో లిస్టు విడుదల చేసేసి మహా కూటమి ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్ కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. తెరాసలో కూడా మిగిలిన సీట్ల కేటాయింపులు పూర్తి కావడంతో ఆయన రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే తొలి విడత ఆయన కొన్ని సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మలి విడతల ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 19 నుంచి 25 వరకూ రాష్ట్రంలో నిర్వహించబోతున్న బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. 19న ఖమ్మం, పాలకుర్తిలో. 20న సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో. 21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ లో సభలుంటాయి. 22న ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముధోల్, ఆర్మూర్. 23న నర్సంపేట, మహబుబాబాద్, జనగామ, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యపేట, జనగామ. 25న తాండూరు, నారాయణ పేట, పరిగి, షాద్ నగర్, ఇబ్రహింపట్నం, దేవరకద్రల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. కేసీఆర్ షెడ్యూల్ ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.
మలి విడత ప్రచారంలో భాగంగా ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ ల మైత్రి మీదనే మరోసారి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తూ ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర్నుంచీ గమనిస్తే… నాలుగేళ్ల పాలనలో వారు సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రచారం చేసుకునే కంటే, మహా కూటమి మీద విమర్శలు చేయడం ద్వారా ఒక సెంటిమెంట్ ను మరోసారి తెలంగాణ ప్రజల్లో రగిలించే ప్రయత్నమే చేస్తున్నారు. ‘తెలంగాణ వ్యతిరేకులు’ అనే భావజాలం తీసుకొచ్చి, ఇతర పక్షాలను అదే దృష్టితో వేలెత్తి చూపించి లబ్ధి పొందే ప్రయత్నమే ఇంతవరకూ తెరాస చేసిన ఎన్నికల ప్రచారంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మలి విడత కూడా కేసీఆర్ అదే అంశాన్ని మరింత తీవ్రంగా ప్రస్థావించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి, ఈ వరుస సభల్లో కేసీఆర్ ప్రచారంలో కొత్త పంథా ఏదైనా ఉంటుందేమో వేచి చూడాలి.