తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా.. దానికో రాజకీయ కోణం ఉంటుంది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదముద్ర వేయించుకుని.. రాష్ట్రపతి దగ్గర క్లియరెన్స్ తీసుకునే లక్ష్యంతో కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోతున్నట్లు మీడియాకు సమాచారం అందింది. అవసరమైతే రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని విడమరిచి చెప్పాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సంపూర్ణ ఫలితం స్థానికులకే దక్కాలంటే కొత్త జోనల్ వ్యవస్థ వుండి తీరాలనేది కేసీఆర్ వాదన. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకే 95శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే తెలంగాణ యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని కేసీఆర్ చెబుతున్నారు.
కేసీఆర్ పంచాయతీ ఎన్నికల దగ్గర్నుంచి ఉద్యోగ నియామకాల వరకూ అన్నీ చేస్తారు. కానీ ఒక్కటి కూడా ప్రాథమిక దశ దాటదు. ఎందుకంటే.. ఒక్కటి కూడా నిబంధనలకు అనుగుణంగా చేయరు కాబట్టి. జోన్ల విషయం కూడా అంతే.. స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు జోన్ల విధానం అంటేనే.. రాజ్యాంగానికి లోబడి లేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు దీనికి ఎలా ఆమోద ముద్ర వేయించుకుంటారో తెలియదు. కానీ ఈ కారణంతో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. భవిష్యత్ రాజకీయాలపై జోరుగా చర్చించనున్నట్లు తలుస్తోంది. ఎందుకంటే.. మిత్రులే లేకుండా వట్టి పోతున్న ఎన్డీఏకు.. అంతో ఇంతో ఇండగా ఉంటున్నది కేసీఆర్. ముందస్తుకు వెళ్లబోతున్నామని..మోడీ.. కేసీఆర్కు చెవిలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి కేసీఆర్ కూడా ప్రిపేరైపోయారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ బీజేపీ కోసం రాజకీయాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడా పార్టీలన్నీ.. కొత్తగా ఫ్రంట్ గా ఏర్పడబోతున్నాయి. దీనికి సంబంధించి కార్యాచరణ ఏమైనా ఉంటే.. ఢిల్లీలో ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ ఉంటారని సమాచారం లీక్ చేశారు కాబట్టి.. రాజకీయ పరమైన చాలా పనులే చక్కబెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.