‘ఇదో దిక్కుమాలిన నిర్ణయం…’ అని స్టార్ట్ చేసిన కెసీఆర్ తనదైన శైలిలో నోట్ల రద్దు నిర్ణయం గురించి ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టేశాడు. టిఆర్ఎస్ నాయకులందరూ కెసీఆర్‌కి వంతపాడారు. నోట్లు రద్దు నిర్ణయాన్ని సమర్థించినవాళ్ళకు కూడా బుద్ధిలేదని అన్నారు. తెలంగాణాకు భారీగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కట్ చేస్తే వారం తిరిగేసరికి కెసీఆర్ నిర్ణయం మారిపోయింది. తెర వెనుక ఏం మతలబు జరిగింది అనే విషయం పక్కన పెడితే నోటు రద్దు నిర్ణయం అద్భుతః అనే రేంజ్లో అదే కెసీఆర్ భజన కార్యక్రమం మొదలెట్టేశారు. నోటు రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్నవాళ్ళను ఏకిపడేశాడు. బిజెపివాళ్ళను కూడా మించిపోయి నల్లధనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించాడు. కెసీఆర్ మాట మార్చడం, తెరవెనుక రాజకీయాల విషయం పక్కన పెడితే తాను ఏం అనుకుంటే అది మాట్లాడుతున్నాడు, తాను ఏం చేయాలనుకుంటే అది చేయగలగుతున్నాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కెసీఆర్‌ది అదే స్టైల్. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా, ఎంత కామెడీ చేసినా కెసీఆర్ అదరలేదు, బెదరలెదు. అప్పట్లో సూపర్ పవర్ పొజిషన్లో ఉన్న సోనియాగాంధీతో సహా అందరినీ కూడా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడానికి ఎప్పుడూ వెనుకాడింది లేదు. ఫైనల్‌గా ప్రత్యేక తెలంగాణా వచ్చింది. తెలంగాణా ప్రజల వరకూ చూసుకుంటే మాత్రం అది చాలా మంచి నిర్ణయమే. వాళ్ళకు అంతా లాభమే.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రశ్నించడానికి వచ్చిన పవన్, వాళ్ళకు అత్యద్భుత రాజధానితో పాటు సింగపూర్ స్థాయి జీవితాలను అందిస్తానని అనునిత్యం తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటున్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మోముల పైన చిరునవ్వులు చిందించడమే తన ఆశయమని చెప్పుకుంటూ ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఉన్న జగన్‌ల నాయకత్వశైలి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలంగాణా ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రనా, ప్రత్యేక తెలంగాణానా? అనే విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే గట్స్ చంద్రబాబుకు లేకుండా పోయాయి. తెలుగు నాయకులందరిలోకి తానే గొప్పవాడిని, అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు…ఆ తెలుగు ప్రజలకు అతి పెద్ద సమస్య వచ్చినప్పుడు మాత్రం గోడ మీద పిల్లిలా వ్యవహరించాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం, పవర్లో ఉన్న సోనియాతో తెరవెనుక మంతనాలు జరిపి జగన్‌ని తొక్కెయ్యడమే టార్గెట్‌గా పెట్టకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశాడు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత నుంచీ అటు మోడీతోనూ, ఇటు కెసీఆర్తోనూ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యాడు చంద్రబాబు. రెండేళ్ళ తర్వాత చట్టబద్ధంగా ఇవ్వాల్సిన వాటినే ప్యాకేజ్ పేరుతో ప్రకటిస్తే ఘనంగా స్వాగతించేశారు. ఇంకో రెండేళ్ళకు అయినా ఆ ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందో రాదో తెలియదు. అప్పుడు మళ్ళీ ప్యాకేజ్ నిధులను ఇవ్వాల్సింది 2019లో ఏర్పడే ప్రభుత్వం. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో అస్సలు తెలియదు. ఇప్పటి ఐదేళ్ళూ మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగింది, ఒరగబోయేది ఏమీ ఉండబోదు అన్న విషయంపైన అయితే చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా మొదటి రోజే స్వాగతించేసిన చంద్రబాబు మోడీని పొగిడేశాడు. ఇక ఆ తర్వాత నుంచీ ప్రజల సమస్యలన్నింటికీ బ్యాంకర్లే కారణం అనే రేంజ్లో వాళ్ళను తిడుతూ తన హీరోయిజం చూపిస్తున్నాడు. నోట్ల రద్దుపై ప్రజల్లో ఉన్న కోపం టిడిపివైపు ఎక్కడ టర్న్ అవుతుందో అన్న భయంతో శివప్రసాద్లాంటి నాయకుల చేత కామెడీ డ్రామాలు చేయిస్తున్నాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు ఫాలో అయిన స్ట్రాటజీ ఇదే.
ఇక జగన్ కథ కూడా సేం టు సేం. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సమైక్యాంధ్ర అన్నాడు కానీ అంతకుముందు అంతా గోడమీద పిల్లి వాటమే. ఇప్పుడు నోట్ల రద్దు విషయంపైన స్పందించడానికే జగన్‌కి బోలెడంత టైం పట్టింది. హర్తాళ్‌లో మేం కూడా పాల్గొన్నాం, విజయవంతం చేశాం అని పులివెందుల ప్రజలకు చెప్పుకున్నాడు కానీ జగన్ మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు ఎందుకో మరి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్ర విభజన పర్వం మొత్తం పూర్తయ్యాక సీన్లోకి ఎంటర్ అయ్యాడు. సినిమాటిక్ డైలాగులు పేల్చాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఎవ్వరినైనా ప్రశ్నిస్తా…ప్రశ్నిస్తా… అన్నాడు. తీరా ఇప్పుడు చూస్తే ఏముంది? ట్విట్టర్లో ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తా…ప్రశ్నిస్తా…అని పవన్ అంటే నిజంగానే మన తరపున ఉద్యమాలు చేస్తాడేమో, మన కోసం తను ముందు నిలబడి పోరాటం చేస్తాడేమో అన్న రేంజ్లో ప్రజలు ఆశలు పెట్టకున్నారు కానీ పవన్ మాత్రం తన ట్విట్టర్లో ప్రశ్నలు వేస్తూ కూర్చుంటున్నాడు. అవి కూడా ఎవ్వరికీ గట్టిగా తగలకుండా రాజకీయ లౌక్యం ప్రదర్శిస్తూ ఉంటున్నాయి.
ఓవరాల్‌గా చూస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే. విధానాలు, ఆలోచనలు మంచివా, చెడ్డవా అనే విషయం పక్కన పెడితే కెసీఆర్‌కి గట్స్ ఉన్నాయి. నాయకత్వం వహించే దమ్ము, ధైర్యం, తెగువ ఉంది. ఎవ్వరితోనైనా ఫైట్ చేయడానికి రెడీ అయిపోగలడు. కానీ చంద్రబాబు, జగన్, పవన్‌లకు మాత్రం అవి ఏ కోశానా లేవు. లౌక్యంగా అధికారాన్ని చేజిక్కుంచుకుందాం. మీడియాను మేనేజ్ చేసి హీరోలమవుదాం అనే ఆలోచనలు తప్పితే పోరాడేతత్వం కానీ, ధైర్యం, తెగువల్లాంటి లక్షణాలు ఎవ్వరిలోనూ లేవు. ఈ నాయకుల తీరు చూస్తుంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం…ఇలా ఏ ఒక్క కల కూడా 2019లోపు నెరవేరే అవకాశం లేదన్న విషయం అర్థమయిపోతోంది. ఇక ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.