తెలంగాణలో మరోసారి ఉద్యమాలు ఉబికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! ముఖ్యంగా విద్యార్థులూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జేయేసీ ఛైర్మన్ కె. కోదండరామ్ ఈ వారంలో నిరుద్యోగులతో నిరసన ర్యాలీని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదనీ, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పిన కేసీఆర్ ఇచ్చినమాట తప్పారంటూ ఆయన విమర్శిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం విశేషం! చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకుంటామని ముందస్తుగా పోలీసులను కోరినా, వారు నిరాకరించారని తెలుస్తోంది. ఈ అంశమై హైకోర్టును ఆశ్రయించారు కోదండరామ్. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేరే ప్రశ్న. కోదండరామ్ ర్యాలీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నట్టు స్పష్టంగా అర్థమౌతోంది. ర్యాలీకి అనుమతి వస్తే ఒక సమస్య.. ఇవ్వకుంటే ఇంకో సమస్య అన్నట్టుగా ఉంది.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి ఇస్తే… రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత బయటపడేలా చేసినట్టే అవుతుంది కదా! ఎందుకంటే, వాస్తవాలు వాస్తవాలే! తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏవో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారుగానీ, నిరుద్యోగ లోకం ఆశించిన స్థాయి నియామకాలు జరగలేదు. అలాగని ప్రభుత్వ శాఖల్లో ఖాళాలు కూడా తక్కువేం లేవు. దీంతో ఈ అసంతృప్తి వారిలో తీవ్రంగానే ఉంది. కోదండరామ్ కార్యక్రమానికి అనుమతి ఇస్తే ఆ తీవ్రత అంతా బయటపడిపోతుంది. ఇదే ప్రతిపక్షాలకు మరో బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోతే… రాష్ట్రంలో అణచివేత ధోరణి పెరిగిపోతోందనీ, ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే కేసీఆర్ సహించలేకపోతున్నారనే విమర్శలూ ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎటొచ్చీ కోదండరామ్ చేపట్టబోతున్న కార్యక్రమం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గానే పరిణమిచ్చేట్టు ఉంది. మరి, దీన్ని కేసీఆర్ మార్క్ చతురతతో ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.