మద్యపాన నిషేధం ఎలా చెయ్యాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త భాష్యం చెప్పారు! ఇంతకీ, మద్య నిషేధం అంటే ఏంటీ… దుకాణాల్లో మద్యం లేకుండా చేయడం. బెల్టు షాపులు సమూలం తీసేయడం. ఏ మార్గాల ద్వారా కూడా మద్యం అందుబాటులో లేకుండా చూడటం కదా! కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఏమన్నారంటే… కాంగ్రెస్ హయాంలో గ్రామ గ్రామల్లో నాటుసారా తీవ్రంగా ఉండేదనీ, అవన్నీ తాము తొలగించామనీ, ప్రజలు చావకుండా కాపాడామనీ కేసీఆర్ చెప్పారు. తాగుబోతుల్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ధరల్ని పెంచామన్నారు ముఖ్యమంత్రి. వీలైతే మళ్లీ పెంచుతామని ప్రకటించారు. రేట్లు పెంచడమంటే మద్యపానాన్ని తగ్గిస్తున్నట్టే, నిరుత్సాహ పరుస్తున్నట్టే అన్నారు!
కాంగ్రెస్ హయాంలో ఏమంత పవిత్రంగా ఉన్నట్టు, మద్యం లేనేలేనట్టు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా మద్యం బంద్ చేశారా అని ప్రశ్నించారు. గతంలో చాలాసార్లు మద్య నిషేధం కోసం చాలామంది ప్రయత్నించినా అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చిందన్నారు. దేశంలో ఒక రాష్ట్రం నిషేధం అంటే అమలు సాధ్యం కాదనీ, మన చుట్టూరా ఐదొందల కిలోమీటర్ల కర్ణాటక, ఆరొందల కిలోమీటర్ల మహారాష్ట్ర, మరో ఐదారొందల కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ సరిహద్దులున్నాయనీ, మద్యం ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు కేసీఆర్.
మద్యపాన నిషేధం సాధ్యం కాదు అన్నది వాస్తవం. కానీ, కేసీఆర్ చెబుతున్న సరిహద్దు రాష్ట్రాల నుంచి ప్రవాహం దానికి కారణం కాదు! ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నదే మద్యం అమ్మకాలు. కొన్ని సీజన్లలో లక్ష్యాలు పెట్టుకుని మరీ కోట్లకు కోట్లకు మద్యం విక్రయాలను ప్రోత్సహించిన సందర్భాలున్నాయి. అంతేకాదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు సరిపోకపోతే, మద్యం ధరలు పెంచుకుని లెక్కలు బేరీజు వేసుకున్న గతం ఉంది. ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కానీ, మద్యం అమ్మకం ఇష్టమే లేనట్టు, బలవంతంగా కొనసాగిస్తున్నట్టు, సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం రావడం వల్ల నిషేధం సాధ్యం కాలేపోతోందన్నట్టు, తాగుబోతుల్ని తగ్గించాలన్న లక్ష్యంతోనే ధరలు పెంచుతున్నట్టు కేసీఆర్ వాపోతున్నారు ఎందుకో?