వచ్చే నెల 23వ తేదీ నుండి 27 వరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన వ్యసాయ క్షేత్రంలో ఆయుత చండీ యాగం చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిపై హేతువాద సంఘాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తేలికగా కొట్టి పడేశారు.
ఈరోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఈ యాగం చేస్తానని నేను మొక్కుకొన్నాను. అందుకే చేస్తున్నాను. దాని కోసం సుమారు రెండు మూడు కోట్లు ఖర్చవుతుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క పైసా కూడా నేను తీసుకోను. నా స్వార్జితం నుండే అంతా ఖర్చు చేస్తాను. తెలంగాణా రాష్ట్ర శ్రేయస్సు కోరి చేస్తున్న యాగం ఇది. కనుక ప్రతిపక్షాలు అనవసరమయిన విమర్శలు చేయడం మానుకొంటే మంచిది. డబ్బు సమస్య లేదు కానీ ఈ యాగం చేయడానికి సుమారు 4,000 మంది వేద పండితులు,1,500 మంది రిత్విక్కులు కావాలి. వారిని దేశంలో మూడు నాలుగు రాష్ట్రాల నుండి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాను,” అని అన్నారు.
ఈ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానిస్తానని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఒకవైపు తెలంగాణాలో రైతులు ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే, స్వంత డబ్బే అయినా రెండు మూడు కోట్లు ఖర్చు చేసి ఇంత ఆర్భాటంగా యాగం చేయడం సమంజసమేనా? సాటి మనిషిని పట్టించుకోకుండా ఎన్ని పూజలు యాగాలు చేస్తే మాత్రం ఏమి లాభం? అని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. కానీ వరంగల్ ఉప ఎన్నికలు ఘోర పరాజయంతో కలత చెందినవారు, తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న కేసీఆర్ ని వేలెత్తి చూపే సాహసం చేయలేకపోతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలోగా మళ్ళీ తేరుకొని కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతారేమో చూడాలి.