ఫిరాయింపులు… దీన్నొక ఆమోదయోగ్యమైన రాజకీయ ఎత్తుగడగా, ఇదేదో పద్ధతి ప్రకారం జరిగే ఓ కార్యక్రమంగా, ఇది సహజ ధోరణి అనే ఒక వాదనను వ్యవస్థలోకి తీసుకొచ్చేయడంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ ప్రయత్నిస్తూ పోతున్నాయి. ఏ రాష్ట్రంలో నాయకులు పార్టీలు మారడం లేదు, టూ థర్డ్ సభ్యులు వస్తామంటే విలీనం చేసుకోకుండా ఏ పార్టీలున్నాయి, సొంతం పార్టీల మీద నమ్మకం పోయినవారే ఏరికోరి వచ్చి చేరితే చేర్చుకోమా… ఇలాంటి వాదనను అధికార పార్టీలు వినిపిస్తూ పోతే, ఈ ట్రెండ్ ని ప్రోత్సహించడం వెనక ఉన్న విలువల లేమి గురించి చర్చ ఎక్కడ జరుగుతున్నట్టు..? ఇదే అంశమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేయడం ఏదో తప్పుగా పదేపదే ఆ పార్టీకి చెందిన సభ్యులు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు కేసీఆర్. ఇదేదో మేం చేసిన తప్పు అనడం సరికాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కొంతమంది సభ్యులు తమ పార్టీలో చేరతామని వస్తే, తానే వద్దన్నాననీ, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు ఇంకా మీరంతా ఎందుకయ్యా అని తానే చెప్పానని కేసీఆర్ అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయిందనీ, ఆ పార్టీ నాయకత్వంలో భవిష్యత్తు లేదని వారే నిర్ణయించుకుని వస్తే చేర్చుకోమా అంటూ సమర్థించుకున్నారు. రాజ్యాంగానికి లోబడే శాసన సభా పక్షాన్ని విలీనం చేశామని చెప్పారు. గోవాలో జరగడం లేదా, టీడీపీ రాజ్యసభ సభ్యులు భాజపాలో కలిసిపోలేదా, ఎక్కడ జరగడం లేదంటూ ఉదాహరణలు ఇచ్చారు కేసీఆర్.
విచిత్రం ఏంటంటే… ఒక రాజకీయ పార్టీనీ, దాని సభాపక్షాన్ని వేర్వేరుగా చూస్తుండటం! నిజానికి, తాజాగా జరుగుతున్న విలీనాల పట్ల లోతైన చర్చ ఎక్కడా జరగడం లేదు. అందరూ ఆర్టికల్ 10 అంటూ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. కానీ, దాన్లో ఉన్నదేంటీ… ఏ పరిస్థితుల్లో విలీనం చేసుకోవచ్చు అనే చర్చే పెట్టడం లేదు. ఒక పార్టీకి చెందిన శాసన సభాపక్షాన్ని విలీనం చేసుకోవాలనుకుంటే, ఆ పార్టీ అనుమతి ఉండాలి. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండానే కొంతమంది సభ్యులు బయటకి వెళ్లిపోయి ఎల్పీని విలీనం చేసుకున్నారు. ఒరిజినల్ పార్టీ అనుమతి ప్రకారమే ఈ విలీనం జరగాలన్నది నిపుణుల మాట. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం మెర్జ్ అయిన తీరే అందుకు సరైన ఉదాహరణ. కానీ, ఈ ప్రక్రియ మీద ఎవ్వరూ చర్చించడం లేదు. పైగా… ఇలా విలీనాలను ఎక్కడ జరగడం లేదంటూ దాన్నొక రొటీన్ వ్యవహారంగా, ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయంగా, అన్ని చోట్లా ఉన్న ఓ ఆనవాయితీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మితి మీరి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే విలీనానికి నాంది. తమకు అవసరం లేదు, చేర్చుకోమంటే విలీనాలు సాధ్యమౌతాయా..? ఇవి నూటికి నూరుపాళ్లూ అధికారంలో ఉన్న పార్టీలు ప్రోత్సహిస్తున్న ఒక దుస్సంప్రదాయం..!