తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య తరచూ ఇదే మాట చెబుతున్నారు. ఇవాళ్ల చేవెళ్ల సభలో కూడా మళ్లీ అదే అంశంతో ప్రసంగం ప్రారంభించారు. ప్రజాస్వామ్య దేశంలో పరిణితి బాగా ఉంటే, ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలూ నాయకులు కాదన్నారు. నిజమైన పరిణితి ఉంటే ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. అట్ల ఉంటేనే దేశం బాగుపడుతుందనీ, మన ఖర్మ అలా ఇక్కడ లేదన్నారు. ప్రజాస్వామ్యం ఒక రోజులో పరిపుష్టం కాదనీ, దాని కోసం శ్రమించాలనీ, తన బాధ్యతగా ఈ విషయాన్ని పదేపదే చెప్తున్నా అన్నారు కేసీఆర్. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దనీ, గత్తరబిత్తిరి ఓటెయ్యొద్దనీ, స్థిరంగా కూర్చుని ఆలోచించి నిర్ణయించి వివేచనతో ఓటెయ్యాలన్నారు. మంచి నిర్ణయంతో ఓటేస్తే ఐదేళ్లపాటు ప్రజల అజెండా అమలౌతుందన్నారు. అటువంటి చైతన్యం రావాలన్నారు.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద కన్ఫ్యూజన్ లేదనీ, అందరూ పాత ఆర్టిస్టులే అన్నారు. ఒకవైపున 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలున్నాయనీ…. పదిహేనేండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చి, ప్రజలు ఆశీర్వదిస్తే నాలుగేళ్లు పాలించిన తెరాస మరో పక్క ఉందన్నారు. ఆ పాలన… అంటూ కరెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో 24 గంటలు కరెంట్ ఎక్కడ ఉందనీ, భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. హైదరాబాద్ తానే నిర్మించానని చంద్రబాబు అంటుంటే… కులీ కుతుబ్ షా ఏం కావాలని మళ్లీ ఎద్దేవా చేశారు. ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ను పెట్టానన్న చంద్రబాబు… నిరంతరాయంగా కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఇక, ఇతర సభల్లో మాదిరిగానే చేవెళ్లలో కూడా ప్రజా కూటమిపై విమర్శలు చేశారు.
ఇంతకీ… ఈ మధ్య కేసీఆర్ తరచూ చెబుతున్న ‘ప్రజాస్వామ్య పరిణితి’ అంటే ఏమిటి..? ప్రజాస్వామ్యంలో ‘ప్రజలు గెలవడం’ అంటే ఏమిటి..? తెరాసకి ఓటెయ్యడమే పరిణితి అన్నట్టుగా చిత్రించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ప్రజలు గెలవడమంటే కేసీఆర్ ని మరోసారి ముఖ్యమంత్రి చేయడమే అన్నట్టుగా ఆయనే ఒక అప్రకటిత దిశానిర్దేశం చేసేస్తున్నారు. ఒక పక్క ప్రజల గెలుపూ, ప్రజాస్వామ్య పరిణితి అని చెబుతూనే… ఆ ముసుగులోంచి ఓటర్ల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయడాన్ని ఏ రకమైన స్వేచ్ఛ అనాలి..? ఒక్కరోజులో ప్రజాస్వామ్యం పరిపుష్టం కాదనీ, అదో సుదీర్ఘ ప్రక్రియ అని ఆయనే అంటారు.. కానీ, కేవలం నాలుగేళ్లు తమ పాలన చూసి తమకు ఓటేయడమే ప్రజాస్వామ్య పరిణితి అంటారు..! పోనీ, ఆ నాలుగేళ్లూ చేసిందేంటయ్యా అంటే… కరెంట్ ఇస్తున్నాం కదా అని ఆ పాయింట్ దగ్గరే సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు..! కేసీఆర్ చెబుతున్న ప్రజాస్వామ్య గెలుపు అంటే… తెరాస గెలుపు మాత్రమే అన్నట్టుగా ఆయన ధోరణి ఉంటోంది.