తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మాంత్రికుడు. ఎవర్ని ఎలా అంటే.. ఎక్కడ తగులుతుందో.. ఆయనకు బాగా తెలుసు. ఎంతైనా విమర్శించొచ్చు అన్న చాయిస్ ఉన్న వాళ్లని.. ఎంత మాటైనా అనగలరు. అదే స్థాయి మాటలతో… విమర్శించగలరు. అలాంటి నేత కేసీఆర్… గద్వాల బహిరంగసభలో మాట తూలారు. రైతు బంధు పథకం ప్రస్తావన వచ్చినప్పుడు… దీనిపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో… విచిత్రమైన పోలిక తెచ్చారు. కౌలు రైతులకు సాయం చేయాల్సిన అవసరమే లేదని చెప్పేందుకు… ఇంటి యజమాని, కిరాయిదారుతో పోల్చారు. కేసీఆర్ మాటలు కౌలు రైతులకు సూటిగానే తగిలాయి. ఆరుగాలం కష్టపడి తాము సాగు చేసుకునే నిజమైన రైతులం తామయితే… సాయం భూస్వాములకు అందుతోందన్న ఆవేదన వారిది. ఇప్పుడు కేసీఆరే నేరుగా తమను అసలు రైతులే కాదన్నట్లు వ్యవహరించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.
పథకం పేరు “రైతు బంధు” అయినా సాయం అందుకుంటున్న వారందరూ రైతులు కాదని… ముందు నుంచీ విమర్శలు ఉన్నాయి. భూ యజమానులందరూ.. రైతులు కాదు. హైదరాబాద్ చుట్టుపక్కల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారు. వారి ఉద్దేశం వ్యవసాయం చేయడం కాదు. చేయడం లేదు కూడా. భూములు ఖాళీగా ఉన్న చోట కౌలుకు ఇచ్చేశారు. ఇరవై నుంచి ముఫ్పై శాతం మంది కౌలు రైతులు తెలంగాణలో ఉన్నారు. వారెవరికీ.. ఈ పథకం అందడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు కౌలు రైతులు. కారణం.. పంట పండినా రాకపోయినా.. నగదు రూపంలో యజమానికి కౌలు చెల్లించాల్సిందే. ఇలాంటి కౌలు దారులకు రైతు బంధు పధకం అమలు కావడం లేదు. కౌలుదారుల్ని గుర్తించడం అంత అసాధ్యమేం కాదు. గ్రామసభలు పెట్టి సమాచారం సేకరిస్తే.. ఎవరు కౌలు రైతో తెలిసిపోతుంది.
కానీ కేసీఆర్… భూములన్నవారిని మాత్రమే రైతులుగా గుర్తిస్తున్నారు. వారి ఓట్లు మాతరమే తనకు చాలనుకుంటున్నారేమో.. ఇప్పుడు కేసీఆర్ పరుషమైన వ్యాఖ్యలతో.. ఒక్క కౌలు రైతులే కాదు.. వ్యవసాయం చేసుకుంటున్నా… రైతు బంధు పథకం అందడం లేదని.. ఆగ్రహంతో ఉన్న వివిధ వర్గాల రైతులు ఉన్నారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారు, పట్టాల్లేని భూముల్లో సాగు చేసుకుంటున్నవారు, కాందిశీకులు, ఇనాం, బంజరు భూముల్లో పంటలు పండించే రైతులు ఇలా కొన్ని లక్షల మంది వీరు ఉంటారు. వీరందిరనీ కేసీఆర్ ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నారు….?
ఖమ్మం జిల్లాలో అత్యధిక మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. మొదటి రియాక్షన్ కూడా కేసీఆర్ పై జిల్లా నుంచే వచ్చింది. కౌలు రైతులు ఆగ్రహంతో రోడ్డు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఇదే విషయంపై నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు హైకోర్టుకు లేఖ రాస్తే.. విచారణకు స్వీకరించింది. దానికి తోడు..కేసీఆర్ కొత్త మంట రాజేశారు. ఇప్పుడ కౌలు రైతులు వర్సెస్ భూయజమానులు అన్నట్లు పరిస్థితి మారిపోతుందన్న పరిస్థితి వస్తోంది.