పొదుపు చెయ్యాలి, ఖర్చులు అదుపు చెయ్యాలి, మీకివ్వాల్సిన నిధులు తగ్గించేస్తాం, ఉన్నవాటితోనే సర్దుకోవాలి, రాష్ట్రం పరిస్థితి బాలేదు… ఇవీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు! ఉన్నట్టుండి పొదుపు మీదకు ముఖ్యమంత్రి దృష్టి మళ్లింది. కారణం నిధులు లేకపోవడమే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, నిధులు ఎందుకు లేవయ్యా అంటే… దేశం ఆర్థిక మందగమనం వైపు నడుస్తోంది కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉందంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమనే వాదనను కూడా రెడీ చేసుకున్నారు. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం మాట్లాడుతూ… అన్ని శాఖలకు నిధులను సమాంతరంగా తగ్గించాలనీ, ఆర్థిక నియంత్రణ అందరూ పాటించాలని మంత్రులకు చెప్పారు. ఆర్థిక క్రమ శిక్షణను అన్ని శాఖల మంత్రులూ అధికారులు పాటించాలని ప్రత్యేకంగా సీఎం కోరారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితివైపునకు నడుస్తోందని ఇవాళ్లే కొత్తగా తెలిసిందా? గడచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలో అన్ని రకాల ప్రాజెక్టులు మందగమనంలోనే ఉన్నాయి. శాఖలకు నిధులేమి కొత్త కాదు, ఇప్పటికే కొరతల్లో ఉన్నాయి. ప్రభుత్వం చెయ్యాల్సిన చెల్లింపుల చీటి చాలా పెద్దగానే ఉంది. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. అన్ని శాఖలూ పొదుపు పాటించాలని అంటున్నారుగానీ… అది సీఎంకీ వర్తించాలి కదా. ఆర్థిక పరిస్థితి బాలేదంటున్నప్పుడు… ఇప్పటికిప్పుడు కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? వాటిని తాత్కాలికంగా ఆపి, ఆ నిధులను ఇతర శాఖలకు మళ్లిస్తామని ప్రకటన చెయ్యొచ్చు కదా. ఇకపై ప్రత్యేక విమాన ప్రయాణాలు చెయ్యననీ, ప్రభుత్వ ధనంతో పార్టీ సభలూ, ప్రభుత్వం సాధించిన విజయాల ప్రచారార్భాటాలు లాంటివి నిర్వహించనని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించొచ్చు కదా. మంత్రులకూ నాయకులకూ అధికారులకూ ఆయనే ఆదర్శవంతులుగా నిలుస్తారు కదా!
ప్రభుత్వం దగ్గర నిధులేవంటూ… దానికి కారణం కేంద్రమే అన్నట్టుగా మాట్లాడుతూ అసలు విషయాన్ని కేసీఆర్ చాకచక్యంగా పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ధనిక రాష్ట్రమే అని చెప్పారు కదా. గడచిన ఐదేళ్లలో సృష్టించిన సంపద అంతా ఏమైనట్టు..? రోజువారీ పాలనకు కూడా రాష్ట్ర సర్కారు దగ్గర సొమ్ము సరిపోవడం లేదా? ఆ మాత్రం కూడా ఆదాయం లేదా? రాష్ట్ర ప్రభుత్వ శాఖల నిధులకు కోత పెడుతున్నారంటూ అంటే…. కేవలం కేంద్ర వైఫల్యమే ఎలా అవుతుంది? ఆర్థిక క్రమశిక్షణ పేరుతో నిధులకు కోతపెడుతూ… కారణం కేంద్రమే అంటూ రాష్ట్ర వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కేసీఆర్ మొదలుపెట్టేశారు.