తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వంద ఎకరాల ఫాంహౌస్ ఉంది. అందులో ఎకరంన్నర విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అయితే ఈ వంద ఎకరాలు ఆయన ఒక్కరికే లేదు… ఆయన కుమారుడు కేటీఆర్‌కు కూడా.. ఉంది. అంటే.. వంద ఎకరాలు ఇద్దరి పేరు మీద ఉందన్నమాట. ఈ విషయం ఎవరో చెబితే.. మనం చెప్పుకోవాల్సిన పని లేదు. స్వయంగా కేసీఆరే చెప్పుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను ఏదైనా కీలకమైన అంశంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు… ఆ అంశానికి సంబంధించి… కింది స్థాయి వ్యక్తుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటారు. అలా.. రెవిన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్న కేసీఆర్.. గతంలో బాధితులతో మాట్లాడారు. ఇప్పుడు కింది స్థాయి సిబ్బందితో మాట్లాడుతున్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం.., అనుమతులు.., పన్నులు.. ఇలా అన్నింటిపై మాట్లాడారు. ఓ సందర్భంలో.., పొలంలో కట్టుకున్న ఇల్లు నమోదు చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదని… ఆ పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఆ సందర్భంలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ ప్రస్తావన తీసుకు వచ్చారు. తన ఫామ్ హౌస్ ఎంత ఉంది.. ఎంత స్థలంలో ఇల్లు ఉంది.. దానికి ఎలా పర్మిషన్ తీసుకున్నా.. ఇలా అన్ని వివరాలను చెప్పారు. అలా తీసుకోవాల్సిందేనని లేకపోతే… ఇబ్బందిపడతారని.. పొలంలో ఇల్లు కట్టుకున్న వారికి చెప్పాలని సూచించారు కూడా.
కేసీఆర్ ఫామ్‌హౌస్ విషయంలో విపక్షాలు చాలా విమర్శలు చేస్తూంటాయి. చాలా సందర్భాల్లో అమెరికాలో ఉద్యోగం చేసిన కేటీఆర్.. అలా వచ్చిన సొమ్ముతో అక్కడ కొనుగోలు చేశారని… చెప్పారు. అయితే… కేసీఆర్ పేరు మీద కూడా కొన్ని భూములు ఉననట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొదట్లో.. ఓ డబుల్ బెడ్ రూమ్ సైజులో… అక్కడ డూప్లెక్స్ ఫామ్ హౌస్ ఉండేది కానీ.. ఇటీవల కాలంలో దాన్ని కూలగొట్టి పెద్ద ఇల్లు కట్టారు. ఆ ఇంటి ఫోటోలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎకరంన్నర విస్తీర్ణంలో ఉంటుందని కేసీఆర్ చెప్పిన తర్వాతే అందరికీ తెలుస్తోంది.