కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే.. “హెలికాఫ్టర్ మనీ” ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో చెప్పారు. దాంతో అందరూ హెలికాఫ్టర్ మనీ అంటే ఏమిటా అన్న చర్చప్రారంభమయింది. అలాగే క్వాంటిటేట్ ఈజింగ్ విధానాన్ని కూడా ప్రస్తావించారు. ఈ రెండు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నవే. ప్రస్తుతం దేశం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని .. ఈ సమస్యకు పరిష్కారంగా.. హెలికాఫ్టర్ మనీ.. క్వాంటిటేటివ్ ఈజింగ్ పద్దతుల్ని పాటించాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. హెలికాఫ్టర్ మనీ అంటే.. వరద బాధితులకు.. ఆహారపొట్లాలను.. హెలికాఫ్టర్లో తెచ్చి విసిరేసినట్లు విసిరేయడం కాదు కానీ… దాదాపుగా అలాంటిదే.
చాలా పెద్ద మొత్తంలో నేరుగా డబ్బులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం. ఆర్థిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి లేదా వడ్డీ రేట్లు పూర్తిగా పడిపోయినప్పుడు నేరుగా ప్రజల వద్దకు సొమ్మును తీసుకెళ్లడాన్నే హెలికాఫ్టర్ మనీ అంటారు. అంటే ప్రజలకు నగదు బదిలీ లాంటి పథకాలతో.. ఇష్టం వచ్చినట్లుగా పంచేయడం. దాని వల్ల వారికి కొనుగోలు శక్తి పెరిగి.. కావాల్సినవన్నీ కొనుగోలు చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో కదలిక వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. రాష్ట్ర ప్రభుత్వాల వద్దే కాదు.. కేంద్రం వద్ద కూడా డబ్బుల్లేవు. మరి ఎక్కడ్నుంచి తెచ్చి ప్రజలకు పంచుతుంది. అంటే డబ్బులు ప్రింట్ చేయడమే. భారతదేశంలో.. నోట్లను ప్రింట్ చేయడానికి ఆర్బీఐకి మాత్రమే అధికారం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ జీడీపీ లెక్కల ఆధారంగా నగదును ప్రింట్ చేస్తుంది.
అలా కాకుండా.. పరోక్షంగా జీడీపీని పట్టించుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా కావాల్సినంత నగదు ప్రింట్ చేసి రాష్ట్రాలకు పంచడమనే విధానమే ఇది. హెలికాప్టర్ మనీ వేరు, క్వాంటిటేవిట్ ఈజింగ్ వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే తక్కువ వడ్డీ బాండ్లను రిజర్వ్ బ్యాంకు తీసుకుని, నగదు ఇచ్చే విధానం.. క్యూఈలో ఓ భాగం. దేశంలో ఉత్పాదకతకు సంబంధం లేకుండా అధికంగా డబ్బులు ప్రింట్ చేస్తే.. అవి చిత్తుకాగితాలతో సమానంగా మారుతాయి. అది దేశ వినాశనానికి దారి తీస్తుంది. అలా కాకుండా ఆర్బీఐ దగ్గర ఉన్న నిధులనే ఇవ్వాలి. కానీ… ఇప్పుడు ఆర్బీఐ వద్ద నిధుల్లేవు. ఉన్న రిజర్వ్ నిధుల్లో .. దాదాపుగా సగం.. ఇటీవలే.. రూ. లక్షా 75వేల కోట్లు ఖజానాకు మళ్లించుకుంది కేంద్ర ప్రభుత్వం.