రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత… ఈ టెర్మ్ లోనే తన కుమారుడు, మంత్రి కేటీఆర్ ని కీలకంగా మార్చేస్తారనే చర్చ కొన్నాళ్లుగా ఉంది. దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. గత టెర్మ్ లో, దశలవారీగా కేటీఆర్ ప్రాముఖ్యత పెంచుతూ, భవిష్యత్తులో పోటీ అవుతారేమో అనే అనుమానంతో మేనల్లుడు హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వచ్చారనడంలో సందేహం లేదు! ఇదంతా చూశాక… వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, దాన్ని నిర్ద్వంద్వంగా కొట్టిపడేశారు సీఎం కేసీఆర్. మరో పదేండ్లపాటు నేనే సీఎం అని ప్రకటించుకున్నారు!
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఆరోగ్యం ఖతమైంది, అమెరికాకి పోతడని చాలామంది మిత్రులన్నారు. ఆ లెక్కన నేను సచ్చిబోట్టి ఇరవయ్యేండ్లాయె అన్నారు. ఇప్పుడు నాకేమైంది, దుక్కలా ఉన్నా. కేసీఆర్ సీఎంగ దిగిపోయి కేటీఆర్ ని చేసుడు పక్కానేనా అని వాళ్లు అంటున్నారన్నారు. అలా నేనెందుకు చేస్తా, నాకు పానం వాటం లేదా అన్నారు. తెలంగాణలో నూటికి నూరు శాతం తెరాస మూడు టెర్ములు అధికారంలో ఉంటుందన్నారు. ఇప్పుడు నడుస్తున్నది ఒకట టెర్మ్, దాని ఆవల రెండు టెర్ములు తమదే అధికారమనీ, దాన్ని ఎవ్వడూ ఆపలేడనీ, ఇప్పుడు తన వయసు 66 మాత్రమేననీ, ఈ టెర్మ్ వచ్చే టెర్మ్ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ ప్రకటించుకున్నారు!
కేటీఆర్ విషయంలో జరుగుతున్న చర్చకు పూర్తిస్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టేశారు సీఎం కేసీఆర్. మరో పదేళ్లపాటు కేటీఆర్ పాత్ర ఏంటనేది దాదాపు స్పష్టం చేసేశారు. ఈ ప్రకటన వల్ల ఏం ఉపయోగం అంటే… పార్టీలో ఆధిపత్య పోరుకు బీజాలు పడకుండా చేయడం అనొచ్చు. కేటీఆర్, హరీష్ రావుల ప్రాధాన్యతపై ఇకపై ఎలాంటి చర్చలకూ ఆస్కారం చేసినట్టయింది. పార్టీలో కొత్తగా అధికార కేంద్రాలు పెరగనీయకుండా, మంత్రులూ ఎమ్మెల్యేలూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కంటే కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కోటరీలు కట్టకుండా ముందే చెక్ పెట్టేందుకు కూడా ఈ వ్యాఖ్యల కొంత ఉపయోగపడతాయి. అయితే, తెరాస మరో రెండు టెర్ములు అధికారంలోకి వస్తుందా లేదా అనేది కేసీఆర్ ప్రకటనలపై ఆధారపడే అంశం కాదు, అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. రాబోయే నాలుగేళ్లపాటు తెరాస పాలన ఎలా ఉంటుందనేదే అసలు గీటురాయి.