తెలంగాణలో రెవిన్యూ సంస్కరణలు అంతం కాదని.. ఆరంభం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవిన్యూ చట్టాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా.. ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే ఆమోదించింది. ఈ చట్టంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించిన కేసీఆర్..ఈ చట్టంలో మార్పులు ఎందుకు అవసరమో వివరించారు. చట్టంపై వస్తున్న అనుమానాలను నివృతి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చేస్తున్న ధరణి చట్టం మాత్రమే కాదని..మిగిలిన చట్టాలు కూడా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ చట్టంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. రెవెన్యూ సంస్కరణలో ఇది తొలి అడుగు మాత్రమేనని సభ్యులకు గుర్తు చేశారు.
సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రేక్షకపాత్ర షోషించడం నేరమవుతుందని… అయితే మార్పును అంత సులభంగా ఎవరూ అంగీకరించరన్నారు. సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఉన్న భూమి కన్నా ఎక్కువ స్థలానికి పట్టాలు పంపిణీ చేశారన్నారు. 55వేల ఎకరాల వక్ఫ్ భూములు..87 వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమమలకు గురయ్యాయని… వెంటనే వక్ఫ్ భూముల్లో లావాదేవీలు నిషేధిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్జోన్లను ప్రకటిస్తాం.. అందులో నిర్మాణాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు పంచడానికి ప్రభుత్వ భూములు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. కౌలుదారి వ్యవస్థను పట్టించుకోబోమని.. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వల్ల ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు.
రెవిన్యూచట్టం ఆమోదంతో.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. సబ్ రిజిస్ట్రార్లు ఇక ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భూములు..భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలరు. ఎమ్మార్వోలు వ్యవసాయ భూముల్ని రిజిస్టర్ చేస్తారు. మ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్ అవగానే మ్యూటేషన్ అయిపోతుంది. కొత్త చట్టంతో అవినీతి అంతమైపోతుందని… అన్ని సమస్యలకు పరిష్కారాలు రావని..కేసీఆర్ .. చట్టంపై అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారు.