తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని ప్రజలు కోరుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన చేసిన ప్రకటన జాతీయ పార్టీ దిశగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే ఆ పేరుతో పార్టీ ప్రకటిస్తున్నట్లుగా చెప్పలేదు .ప్రజలు కోరుతున్నట్లుగా చెప్పారు. ఆవిర్భావ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలో రాజకీయాలపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని గద్దె దించడం లక్ష్యం కాదని ప్రకటించారు. ‘ బీజేపీకి వ్యతిరేక, అనుకూల ఫ్రంట్ కాదు.. మారాల్సింది ప్రభుత్వాలు కాదు. ప్రజల జీవితాలు మార్చాలన్నారు.
ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది మన అంకిత భావానికి మంచి ఉదాహరణ. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్లు, పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తతమైనటువంటి పది గ్రామాలు తెలంగాణవే నిలిచాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. మన పనితీరుకు ఇది మచ్చుతునక అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్మెంట్ తెలంగాణలో లేదన్నారు. ఒక నిబద్ధమైన పద్ధతిలో, అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నాం. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు.
నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్త అని కేసీఆర్ ప్రజలకు పార్టీని అంకితం చేశారు.