తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చారు. వెళ్లారు. కేసీఆర్, ఆయన కుటుంబం.. ఎయిర్పోర్టు నుంచి ఇంద్రికీలాద్రికి.. ఇంద్రకీలాద్రి నుంచి ఎయిర్పోర్టుకు మాత్రమే కారులో పర్యటించారు. కానీ వారు విజయవాడను పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రాజధాని కళ వచ్చిందన్నారు. కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో తాను విజయవాడ వచ్చినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుని.. మరీ అభినందనల వర్షం కురిపించారు.
మంత్రి దేవినేని ఉమ.. కేసీఆర్ వెంట… పర్యటన మొత్తం ఉన్నారు. ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని.. మళ్లీ వీడ్కోలు చెప్పే వరకూ.. ప్రొటోకాల్ బాధ్యతను దేవినేని ఉమనే తీసుకున్నారు. కేసీఆర్, కేకే, దేవినేని ఉమ ఒకే వాహనంలో ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించారు. రోడ్డుకిరువైపులా, డివైడర్లలో ఉన్న గ్రీనరీని చూసి కేసీఆర్ మెచ్చుకున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఘాట్ లు, కమాండ్ కంట్రోల్ రూం, ఇతర రహదారుల విస్తరణ చూసి మరోసారి అభినందించారు. గతంలో తాను వచ్చినప్పటికీ..ఇప్పటికీ దుర్గ గుడి మారిపోయిందని.. చాలా అభివృద్ధి జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరిగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడాలనుకున్నారు. కానీ చంద్రబాబు ఆముదాల వలస బహిరంగసభలో మాట్లాడుతూండటంతో సాధ్యపడలేదు.
దాదాపుగా ప్రతి విషయంలోనూ… కేసీఆర్ విజయవాడ అభివృద్దిని ప్రశంసిస్తూనే ఉన్నారు. కానీ.. ఆ అభివృద్ది ప్రశంసలను.. అలా ఏపీకో..ఏపీ ప్రభుత్వానికో వదిలేస్తే ఆయన కేసీఆర్ ఎందుకవుతారు. చివరిగా రాష్ట్రం విడిపోవడం వల్లనే ఇటువంటి అభివృద్ధి జరిగిందని తేల్చేశారు. గతంలో కేసీఆర్ తిరుపతి, అనంతపురం జిల్లాలకు వెళ్లినప్పుడు.. టీడీపీ నేతలు కొంచెం ఓవరాక్షన్ చేశారు. అతిగా కలవడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లాంటి హడావుడి చేశారు. దీంతో.. తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అనంతపురంలో పరిటాల కుటుంబంలో పెళ్లికి వెళ్లినప్పుడు… కేసీఆర్ మరీ రాజకీయ వ్యూహం అమలు చేశారు. దాంతో.. మిత్రులపైన పయ్యావుల – రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా.. టీడీపీ నేతలు జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు.