ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై..సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఫిర్యాదులు చేసిన ఏపీ ప్రభుత్వ తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ పెద్దలను తనంతట తనే పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడానని … రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించానన్నారు.
బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చాలా స్పష్టంగా చెప్పానని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోందని, తెలంగాణ ప్రాజెక్టులపై నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా సరిగా లేదన్నారు. తెలంగాణకు ఉన్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నింటికీ అనుమతులు ఉన్నాయంటున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన నీటిని వచ్చినట్లుగా విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తూండటాన్ని నిలిపివేయాలని.. కేఆర్ఎంబీ లేఖలు రాయడంపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం అసలు సాగునీటి ప్రాజెక్ట్ కాదని…విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టని అంటున్నారు. ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ చేపట్టడంతోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ప్రారంభమయింది. రెండు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులైప ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం అపెక్స్ కౌన్సిల్ వరకూ వెళ్లింది.