కేసీఆర్‌ను పరామర్శించేందుకే జగన్ రెడ్డి హైదరాబాద్ రాలేదు. ఆ కారణం పేరుతో ఇతర పనులు చక్క బెట్టుకోవడానికి వచ్చారు. కేసీఆర్‌తో దాదాపుగా గంట సేపు జగన్ రెడ్డి ఏకాంతంగా చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం పని చేసిన చెవిరెడ్డి, కేటీఆర్ వంటి సన్నిహితులు మాత్రమే ఈ చర్చల్లో పాల్గొన్నారు. గంట సేపటి చర్చలో కేసీఆర్ తన ఓటమి అనుభవాలను జగన్ రెడ్డికి చెప్పారు. ఆ తప్పులు మాత్రం చేయవద్దని సూచించారని అంటున్నారు. ఈ మాటల్ని జగన్ రెడ్డి చెవికి ఎక్కించుకునే అవకాశం లేదు.. ఆయన చేయాలనుకున్నది చేస్తారు.
అయితే రాజకీయాలు మాత్రమే కాదని.. కేసీఆర్ ఓడిపోవడం వల్ల తర్వాత రానున్న సమస్యలపైనా మాట్లాడారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్, జగన్ మధ్య రాజకీయ సంబంధాలే కాదు.. అంతకు మించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. జగన్ రెడ్డికి బాగా దగ్గర అయిన మేఘా, అరబిందో, హెటెరో వంటి వాటి విషయంలోనూ చర్చలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరస్పర సహకారంపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ తో చర్చల తర్వాత జగన్ రెడ్డి అనూహ్యంగా లోటస్ పాండ్‌కు వెళ్లారు. రెండేళ్లుుగా లోటస్ పాండ్ వైపు జగన్ చూడలేదు. అయితే ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ లోటస్ పాండ్‌లో ఉండటంతో చర్చించడానికి వెళ్లారు. అక్కడ ఓ అరగంట సేపు మాట్లాడిన తర్వాత.. గన్నవరం వెళ్లిపోయారు. షర్మిల, బ్రదర్ అనిల్.. ఢిల్లీలో ఉన్నారు. ఈ చర్చల కోసమే జగన్ హైదరాబాద్ వచ్చారు కానీ.. దానికి పరామర్శ అనే పేరు పెట్టారని తెలుస్తోంది.