భూ రికార్డుల ప్రక్షాళనను ఒక ఉద్యమంగా చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా రికార్డుల ప్రక్షాళన జరగాలని కేసీఆర్ అధికారులకు సూచిస్తున్నారు. ఇకపై రెవెన్యూ అధికార యంత్రాంగం అంతా ఇదే పనిలో బిజీబిజీగా మారబోతోంది. ఇక, తెరాస నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల విషయానికొస్తే… వీరికి కూడా ముఖ్యమంత్రి లక్ష్యాలు నిర్దేశించారు. వీరంతా రైతు సంఘాల ఏర్పాట్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలందరూ ఈ సంఘాల ఏర్పాటును దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుందని సీఎం ఆదేశించారు. దీంతో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు నియోజక వర్గాల బాట పట్టారు. రైతు సంఘాలను ఏర్పాటు చేయడంతోపాటు, రైతు సదస్సులు నిర్వహించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంది. అలాగే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా నేతలు స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వారంలో కనీసం ఒకట్రెండు రోజులైనా ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యేలంతా, ఇకపై సొంత నియోజక వర్గాల్లోనే కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే నాలుగు నెలలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రాంతాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ హైదరాబాద్ లో చక్కర్లూ కొడుతూ తిరిగే ఎమ్మెల్యేలకు ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ముఖ్యమంత్రి నిర్దేశించి తాజా లక్ష్యం ప్రకారం నాయకులందరూ మారు మాట్లాడకుండా పనిచేయాల్సిందే! ఎందుకంటే, తాజా బాధ్యతల అప్పగింత వెనక అలాంటి ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి! సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వడంతోపాటు, వారిని గెలిపించుకునే బాధ్యత తనదీ అనీ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలందరూ చాలా సంతోషించారు. తమ సీట్లకు ఎలాంటి ఢోకాల లేదని ధీమాతో ఉన్నారు. అయితే, ఆ ప్రకటన కింద ఓ స్టార్ మార్క్ ఉందనీ, షరతులు వర్తిస్తాయనీ ఇప్పుడిప్పుడే వారికి అనుభవంలోకి రావడం మొదలైంది!
సీఎం కేసీఆర్ త్వరలోనే ఎమ్మెల్యేల పనితీరుపై మరో సర్వే చేయించబోతున్నట్టు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సర్వేలో సిటింగుల పనితీరును అంచనా వేస్తారనీ, దాని ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. ఈ నాలుగు నెలల పనితీరునే కొలమానంగా తీసుకుని ఆ సర్వేలో మార్కులు ఉంటాయనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి వేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు నెలలపాటు కచ్చితంగా నియోజక వర్గాలకే పరిమితం అవుతారని అనడంలో ఎలాంటి సందేహం లేదు! సెప్టెంబర్ 1 నుంచి 9 వరకూ రైతుల సంఘాలను ఏర్పాటు చేయడం, 10 నుంచి నాలుగు రోజులపాటు సదస్సులు నిర్వహించడం, ఈ తరుణంలో గ్రామాల్లోనే ఎమ్మెల్యేలు ఉండాలి. ఆ తరువాత, భూ రికార్డుల ప్రక్షాళనను దగ్గరుండి చూసుకోవాలి. ఇలా నియోజక వర్గం వదిలి బయటకి వెళ్లేందుకు అవకాశం లేకుండా టైమ్ టేబుల్ ఇచ్చేశారు. సిటింగులకు సీట్ల పేరుతో.. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఇంకెన్ని పనులు చేయిస్తారో చూడాలి. ఎమ్మెల్యేలను మరింత క్రియాశీలకంగా మార్చడం కోసం కేసీఆర్ అనుసరిస్తున్న నయా విధానం బాగానే ఉంది!