రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని.. జగన్ ఆలోచనను ప్రోత్సహించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్కు ఈ ప్రాజెక్టు గురించి తెలుసని.. ప్రగతి భవన్లోనే ఆ ప్రాజెక్ట్ డ్రాఫ్ట్ తయారయిందని.. విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో సజ్జల నేరుగా .. కేసీఆర్ ఆమోదంతోనే నిర్మిస్తున్నట్లుగా ప్రకటించడం కలకలం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్.. సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన సమావేశంలో తాను కూడా ఉన్నానని సజ్జల సాక్ష్యం చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. రాయలసీమ నీటి కష్టాలు తెలుసని .. నీటి కష్టాలు తీరుస్తామని పెద్దన్నగా ఉంటానని కేసీఆర్ మాటిచ్చారని సజ్జల చెబుతున్నారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో నిర్ణయాలు తీసుకుంటూండటంపై సజ్జల విచిత్రంగా స్పందించారు. కొన్ని శక్తులు ఇందు కోసం ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. సజ్జల చెప్పిన దానికి రికార్డెడ్ సాక్ష్యాలు ఏమీ ఉండవు కానీ.. అంతర్గత సమావేశాల్లో సజ్జల కూడా పాల్గొంటూ ఉంటారు. ఈ మాటలు నిజమే అనిపించేలా.. గతంలో నగరిలో రోజా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించిన కేసీఆర్.. రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ప్రకటించారు. బహుశా… జగన్మోహన్ రెడ్డి ఆలోచన కు అనుమతి ఇచ్చి ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.
అదేసమయంలో.. కేసీఆర్.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో సీరియస్గా ఉండటానికి .. గతంలో ఉమ్మడి ప్రాజెక్టుకు జగన్ ఓకే చెప్పి.. తర్వాత వెనక్కి తగ్గడంతో కేసీఆర్.. గతంలో తాను అంగీకరించి ఇప్పుడు వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి రాయలసీమ ఎత్తిపోతల అంశం .. సీఎం జగన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని.. సంబంధాలు బాగున్నప్పుడు ఇరువులు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న సందర్భంలో పురుడు పోసుకుందన్న ఆరోపణలు నిజమైనవేనని.. సజ్జల వ్యాఖ్యలతో నిరూపిస్తున్నాయంటున్నారు.