ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ కాలు దువ్వారు. మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అధికారికంగా ప్రచార భేరీ మోగిస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చేస్తామంట చిటికెలు వేస్తున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది..? ఏం చేస్తోంది..?. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనతో తమ జాతకం మారిపోతుందని.. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇంకా ఊహాల్లోనే తేలిపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ అంటే.. గాంధీభవన్‌లో కూర్చుని.. మాట్లాడుకోవడమే అన్నట్లు ఉంది వారి పరిస్థితి.
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు గందరగోళంగా ఉన్నా.. ఎలాగో.. ధీటుగా తిప్పికొట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అసలు కేసీఆర్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తాత్కాలికంగా డిసైడయింది. పీసీసీ చీఫ్.. గాంధీభవన్ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లు ప్రారంభించారు. ఓటర్ల జాబితా, శక్తి యాప్ నమోదు, ఎన్నికల సంసిద్దతపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవైపు టిఆర్ఎస్ భవన్ శుక్రవారం కెసీఆర్ రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తుండగానే….అదే సమయంలో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఓటర్ల నమోదు యుధ్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని బూత్ కమిటీ అధ్యక్షులకు ఆదేశాలిచ్చారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెనిఫెస్టో కమిటీ ఎన్నికల హామీల జాబితాను రూపొందించింది. జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సుల మేరకు తాము అధికారంలోకి రాగానే మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. నిరుద్యోగ భృతి కోసం నెలకు 300కోట్లరూపాయలు అసాధ్యమేమీ కాదని వారంటున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామంటోంది. అయితే హామీలకే ఓట్లు రాలతాయని.. కాంగ్రెస్ నేతలు ఆశ పడితే.. అది ఇబ్బందికర పరిణామమే క్షేత్ర స్థాయిలో కేసీఆర్‌ను ఢీకొట్టగలిగినప్పుడే… పోటీలో కాంగ్రెస్ ఉంటుంది. లేకపోతే లేనట్లే..!