నిజామాబాద్, నల్గొండ, వనపర్తి… ఇలా వరుసగా ఎన్నికల ప్రచార సభలతో కేసీఆర్ హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభల్లో కాంగ్రెస్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ అంటున్నారు. పనిలోపనిగా తెలుగుదేశం పార్టీ మీద, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విమర్శల విషయమై కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆసక్తికరమైన విశ్లేషణ జరుగుతూ ఉండటం విశేషం! తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కి ఎందుకు అంటూ విమర్శలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా, ఆంధ్ర ప్రాంత నేతలపైనా కేసీఆర్ విమర్శలు పెంచడం వల్ల… సీమాంధ్ర ప్రాంత సెటిలర్ల మహాకూటమికి దగ్గరౌతారంటూ ఓ కాంగ్రెస్ ప్రముఖుడు ఆఫ్ ద రికార్డ్ గాంధీ భవన్ లో అన్నారు. విభజనకు తరువాత సీమాంధ్రులను కేసీఆర్ కొంత దగ్గర చేసుకున్నారుగానీ, ఇప్పుడు ఇలా తీవ్రమైన విమర్శలు చేస్తూ మరోసారి దూరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. కేసీఆర్ విమర్శలను సీమాంధ్ర సెటిలర్స్ లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహం కూడా సిద్ధమౌతోందట! దీనికి ప్రధానంగా సోషల్ మీడియాను వేదికగా మార్చుకోవాలని చూస్తున్నారట! కేసీఆర్ కి అవసరం అనుకుంటే… ఆంధ్రాకి వెళ్తారనీ, అక్కడి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారనీ… ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్రులు దోపిడీ దారులు అంటున్నారనే అంశాన్ని ప్రచారం చేస్తారట.
అంతేకాదు, ఆ మధ్య అనంతపురం పర్యటన సందర్భంగా సీమాంధ్ర నేతలతో చనువుగా వ్యవహరించడం, టెక్ మహీంధ్ర వంటి సదస్సుల్లో హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఉందని కేటీఆర్ మెచ్చుకోవడం, ఇప్పుడు దోపిడీ చేశారంటూ విమర్శించడం… ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంచడం వల్ల తెలంగాణలోని సెటిలర్లు మహాకూటమికి ఆకర్షితులు అవుతారన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. సీమాంధ్ర నేతలపై కేసీఆర్ ఎంతగా విమర్శలు చేస్తే అంతే మంచిందనే అభిప్రాయం కాంగ్రెస్ లో ఉంది.