కేసీఆర్ అంటే అపర చాణక్యుడని చెబుతారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు తప్ప మరెవరికీ విజయావకాశాలు లేవని అందరూ అనుకున్నారు. కేసీఆర్ కూడా అదే అనుకున్నారు. కానీ ఈ ఆలోచనతో ఏం చేసినా చెల్లుతుందని తీసుకున్న నిర్ణయాలతో మాజీ అయిపోయారు. తాను ఏం చేసినా చాణక్యం అని పొగిడేవారు నిజమనుకున్నారు. తీరా పరాజయం పాలైన తర్వాత కానీ అసలు వి,యం అర్థం కాలేదు.
సెంటిమెంట్ ఆయుధాన్ని వదిలేసుకుని యుద్ధం !
తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరాజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకోవడం అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమయింది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్థానం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్సయిపోయింది.
పేరు బంధం కూడా తెగిపోయిందని ప్రజల్లోకి తీసుకెళ్లిన విపక్షాలు
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడం.. తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు మొదట్లోనే విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ను తెలంగాణ వ్యక్తిగా రేవంత్ రెడ్డి అంగీకరించరు. ఆయన మూలాలు బీహార్లో ఉన్నాయని.. పూర్వీకులు విజయనగరం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. దీన్నే గుర్తు చేస్తూ.. కేసీఆర్కు తెలంగాణతో పేగుబంధం లేదని.. ఇప్పుడు పేరు బంధం కూడా తొలగించుకున్నారని ప్రచారం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని ప్రకటించేశారు. చాలా మందిది అదే అభిప్రాయం. కేసీఆర్ తెలంగాణను వదిలేస్తున్నారని నమ్మారు. అప్పట్నుంచి కేసీఆర్ తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పలేకపోయారు. అంటే కేసీఆర్ తన పునాదుల్ని తానే వీక్ చేసుకున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు ఎన్నికల్లో కనిపించింది.
ఫిరాయింపు దార్ల కోసం బలమైన నేతలను వదిలేసుకున్న వైనం
అవసరం లేకపోయినా ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇచ్చారు. అంతే కాదు వారి కోసం సీనియర్ నేతలను వదులుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, తుమ్మల సహా అనేక మందిని వదులుకున్నారు. వారి వల్ల పది సీట్ల వరకూ కోల్పోయారు. అధికారానికి కూడా దూరం అయ్యారు. ఆ నేతల బ లాన్ని ఎందుకు కేసీఆర్ గుర్తించలేకపోయారన్నది అర్థం కాని విషయం. కాంగ్రెస్ తరపున గెలిచి వచ్చిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చారు. ఒక్క సబితా ఇంద్రా రెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు.
కేసీఆర్ తెలంగాణ సాధన ఇమేజ్ కూడా మసకబారిపోతుంది !
తెలంగాణ ఏర్పాటు ఓ అద్భుతం. చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని ప్రజల్లో నిగూఢంగా ఉన్న కోరికను వెలికి తీయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా ప్రజల్ని తన వైపు చూసేలా చేసుకోవడం అంత తేలిక కాదు. ఏదో గాల్లో రాయి వేద్దమనుకుంటే ట్రై చేయవచ్చు కానీ.. ఇక్కడ పునాదులు కదిలిపోతే.. తర్వాత చరిత్ర మారిపోతుంది. అలాంటి ప్రమాదాన్ని కేసీఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాధాన్యం మసకబారిపోతుంది. మొత్తంగా కేసీఆర్ చాణక్యం పతనానికి కారణం అయింది.