ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయదని..అక్కడ మన్ను కూడా జరగదంటూ..కేసీఆర్ చేసిన వెటకారంతో.. ఏపీ రవాణా మంత్రి పేర్ని నానికి మరింత కసి పెరిగిందట. అందుకే… గతం కన్నా.. ఎక్కువ కసిగా.. ఇప్పుడు.. ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ విషయాన్ని పేర్ని నానినే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే… ఆర్టీసీని విలీనం చేస్తామని..ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికి ఐదు నెలలయింది. అధికారంలోకి రాగానే.. ఓ కమిటీ వేసి.. విలీనానికి సిఫార్సు చేస్తూ.. నివేదిక తెప్పించారు. దాన్ని ఆమోదించి.. మరో కమిటీ వేశారు. ఇప్పుడు.. ఆ కమిటీ… విలీనంపై పని చేస్తోంది. నెలన్నర దాటిపోయినా.. ఆ కమిటీ ఎన్ని సార్లు సమావేశం అయిందో ఎవరికీ తెలియదు.
అయితే.. ఆ కమిటీకి సాయం కోసం మరో వర్కింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇలా కమిటీల మీద.. కమిటీలు వేస్తున్నారు. ఈ కారణంతో పాటు తెలంగాణలో జరుగుతున్న పరిణమాలతో.. ఆర్టీసీ కార్మికుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ.. విలీనం అనే మాట ఎత్తడం లేదు. ఆయన అసాధ్యం.. అసంభవం అని చెబుతున్నారు. మరో వైపు ఏపీ సర్కార్.. ఈ విషయంలో చేసి చూపిస్తామని ముందడుగు వేస్తోంది. ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న తెలంగాణనే సాధ్యం కాదంటే… ఏపీ ఎలా చేస్తుందన్న అనుమానాలొస్తున్నాయి.
ఈ విషయంపై ప్రభుత్వంపై అనుమానంగా చూసే వారి సంఖ్య పెరగడంతో.. ఏపీ సర్కార్ పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అందుకే.. సందర్భం వచ్చినప్పుడల్లా… తాము… చేసి చూపిస్తామని అంటున్నారు. కేసీఆర్ మాటలతో కసి పెరిగిందని అంటున్నారు. ఏపీ సర్కార్ ఎంత ఆలస్యం చేస్తే.. అంతగా అనుమానాలు పెరిగిపోతాయి. కేసీఆర్ అసంభవమన్న విషయాన్ని… ఏపీ సర్కార్ ఎంత వేగంగా పూర్తి చేస్తుందో మరి..!