ఆంధ్రా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాననీ, రావడం పక్కా అంటూ తెరాస అధినేత కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వస్తానంటూ సిద్ధమయ్యారు కదా. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైకాపాకి మద్దతుగా వస్తానని తేల్చేశారు. కేసీఆర్, ఒవైసీల కామన్ అజెండా జాతీయ స్థాయిలో కొత్త తరహా రాజకీయాలకు తెరలేపడం! ఎన్నికల ఫలితాల ముందురోజు కూడా తాను అసదుద్దీన్ తో అదే చర్చించానని కేసీఆర్ చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే, ఏపీ రాజకీయాలకు వస్తామని చెబుతున్న ఈ తెరాస, మజ్లిస్ ల రాష్ట్ర అజెండా ఏంటనేదే స్పష్టంగా కనిపించడం లేదు.
సరే, ఎవరికి మద్దతుగా కేసీఆర్ ఆంధ్రాకి వచ్చినా… ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. హోదా మీద మీ వైఖరి ఏంటని ఆంధ్రా ప్రజలు అడుగుతారు. ‘చంద్రబాబుకే స్పష్టత లేదు, దాని గురించి నాకెందుకు’ అంటూ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంటే… ప్రస్తుతానికి కేసీఆర్ కి ఉన్న వైఖరి ప్రకారం ఆంధ్రాకి దక్కాల్సిన ప్రత్యేక హోదాపై ఎలాంటి కన్సర్న్ లేదనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే… రాష్ట్రాలకు హక్కులు పెరగాలి, నిర్ణయాత్మక శక్తిగా రాష్ట్రాలు ఎదగాలన్న ఉద్దేశంతోనే జాతీయ రాజకీయాలకు వెళ్తానని ఒకపక్క చెబుతున్నారు! ఏపీకి వచ్చేసరికి ప్రత్యేక హోదా గురించి ఇలా మాట్లాడుతున్నారు..! మరి, సమీప భవిష్యత్తులో ఆంధ్రాకి వచ్చి దీని గురించి ఏం చెబుతారు..?
ఇక, అసదుద్దీన్ విషయానికి వద్దాం! ఆంధ్రాలో టీడీపీని ఓడించడమే లక్ష్యం అంటున్నారు. ఏ అజెండాతో ఇక్కడ రాజకీయాలు చేస్తారు..? పైగా, వైకాపాతో కలిసి పని చేస్తానంటున్నారు.. బాగానే ఉంది, కానీ ఏ ప్రాతిపదిక వైకాపాకి మద్దతు ఇస్తున్నారు..? కేవలం టీడీపీని ఓడించడమే మజ్లిస్ అజెండానా..? ఏపీ ప్రజల ప్రయోజనాల అజెండా అక్కర్లేదా..? ప్రజల ప్రయోజనాల కోసమే వస్తున్నామంటే… ప్రత్యేక హోదాపై మజ్లిస్ వైఖరేంటి..? దాన్ని జగన్ సాధిస్తారన్న నమ్మకంతోనే మద్దతు ఇస్తున్నట్టా..? సరే, అదే జగన్ కి మద్దతు వెనకున్న మజ్లిస్ నమ్మకం అనుకుంటే… లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఎవరి ద్వారా ప్రత్యేక హోదా జగన్ సాధించగలరని నమ్ముతున్నట్టు..? కాంగ్రెస్ తో కొట్లాడి బయటకి వచ్చి జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారు. పైగా, టీడీపీతో కూడా కాంగ్రెస్ దోస్తీ ఉంది కాబట్టి, ఆ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో జగన్ కలవలేరు. కేంద్రంలోని భాజపా సర్కారు మీద గడచిన నాలుగేళ్లుగా హోదా కోసం పోరాటం చేశామని చెప్పుకున్నారు, ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు. ఆంధ్రాకి హోదా రాకపోవడానికి కారణం భాజపా అనేది ముమ్మాటికీ నిజం. కాబట్టి, జాతీయ స్థాయిలో ఆ భారతీయ జనతా పార్టీకీ జగన్ మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న జగన్ కు ఏ అజెండా ప్రకారం మజ్లిస్ మద్దతు ఇస్తున్నట్టు..?
పోనీ.. జాతీయ స్థాయిలో కేసీఆర్ రాజకీయ శక్తి ఎదుగుతారనే నమ్మకం మజ్లిస్ కి బలంగా ఉందని అనుకున్నా, ఏపీ ప్రత్యేక హోదా విషయానికి వచ్చేసరికి ఆయన వైఖరి భిన్నంగా ఉంది కదా! ఏపీకి వస్తామంటున్న తెరాస, మజ్లిస్… ప్రత్యేక హోదాపై స్పష్టమైన వైఖరి ముందుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.