ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆహ్వానిస్తున్నారని.. వంద శాతం.. ఏపీకి వెళ్తానని.. ఓ వైపు కేసీఆర్ గట్టిగా చెబుతున్నారు. మరో వైపు ఇటీవలి కాలంలో కేసీఆర్ కు ఆప్తమిత్రునిగా మారిపోయిన మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా…అదే మాట చెబుతున్నారు. తాను.. కూడా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. ఏపీకి వెళ్లి జగన్కు మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సారి టీడీపీ రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేదని అసదుద్దీన్ జోస్యం చెప్పారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారన్నారు. ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అసద్ చెప్పారు.
దేశ రాజకీయాలను అసదుద్దీన్ తో కలిసి మారుస్తానని.. కేసీఆర్ చెబుతున్నారు. దాని కోసం తిరగడానికి ఇప్పటికే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేసుకున్నామని.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటించారు. బహుశా..వీరి దృష్టి ముందుగా ఏపీపై ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ కు తోడుగా.. తాను కూడా.. ఏపీలో పర్యటిస్తానని… నేరుగా జగన్ కు మద్దతు ఇస్తానని ప్రకటించారు. బహుశా కేసీఆర్ మద్దతు కూడా జగన్ కే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… ఏపీలో జగన్ బలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే.. పక్కా ప్లాన్ తోనే అటు కేసీఆర్, ఇటు అసదుద్దీన్.. జగన్మోహన్ రెడ్డి కోసం ఏపీలో అడుగు పెడుతున్నట్లు భావింవచ్చు.
మూడో ఫ్రంట్ పేరుతో… కేసీఆర్ .. భారతీయ జనతా పార్టీ కోసం మిత్రపక్షాలను… సమీకరిస్తున్నారన్న విషయం .. జాతీయ రాజకీయాల్లో అందరికీ తెలుసు. అయినప్పటికీ.. అసదుద్దీన్ కేసీఆర్ అజెండా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఆశ్చర్యం రేపుతోంది. గతంలో మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సహకరించేందుకు .. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా ఉండేందుకు ఓవైసీ అభ్యర్థుల్ని నిలబెట్టారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఇప్పుడు కూడా.. కాంగ్రెస్ తో కలిసి కూటమి కడుతున్న చంద్రబాబును దెబ్బకొట్టి.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కేసీఆర్ చెప్పినట్లు అసదుద్దీన్ నడుచుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.