ఇటీవల రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్హౌం కార్యక్రమానికి హఠాత్తుగా జనసేనాద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు?దీనిపై రాజకీయ మీడియా వర్గాల్లో రకరకాలైన వూహాగానాలు నడుస్తున్నాయి.
వైసీపీ కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా రెండు చోట్ల నడుస్తున్న రాజకీయ పునస్సమీకరణలో భాగంగానే ఆయనను ఇద్దరు ముఖ్యమంత్రులు ఇష్టపడుతున్నారన్నది ఒక వాదన. వారి ప్రోత్సాహంతోనే పవన్ వచ్చారని ఈ కథనం సారాంశం. గతంలో కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేసి విపరీతమైన దాడికి గురైన పవన్ ఇప్పుడు అదే వ్యక్తులతో ముచ్చట్లాడటం, తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించడం గమనించదగ్గది. ఒక సిద్ధాంతం ప్రకారం ఎపిలోనూ తెలంగాణలోనూ కూడా పవన్‌ను తమతోనే వుంచుకోవడానికి టిడిపి నాయకత్వం నానా తంటాలు పడుతున్నది. బిజెపి జాతీయ నేతలు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పినా ఎలాగోలా వారి వెంటపడాలనే నిర్ణయించుకుంది.
అధికారికంగా పొత్తు లేకున్నా ఎలాగోలా రాజీకి రావడానికి సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నది. అంటే కొన్నిసీట్లలో లోపాయికారిగా మద్దతు తీసుకుని మిగిలిన చోట్ల తను బిజెపినే బలపర్చడం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌తోనూ పరిమిత అవగాహనకు రావడం. ఈ కథలో కొసమెరుపు ఏమంటే ఇలాటి కలయికకు కెసిఆర్ ఆశీస్సులు కూడా వుండొచ్చట. ప్రధాన ప్రతిపక్షంగా పరిగణిస్తున్న కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా చేయడానికి ఈ కలయికను అనధికారికంగా అవగాహన ఏర్పర్చుకుంటారు. తద్వారా ప్రతిపక్ష ఓట్లు చీల్చే ప్రయత్నం చేయొచ్చు. పవన్ గతంలో ఎపి గురించే ఎక్కువగా మాట్లాడినా హైదరాబాదులోనూ మరికొన్ని చోట్ల తనదైన ప్రభావం చూపి ఓట్లు రాబట్టగలరని అంటున్నారు. ఇక టిడిపి నేతలు రేవంత్ రెడ్డి వంటివారికి కాంగ్రెస్‌తో పొత్తు అవకాశమే లేదని అద్యక్షుడి హౌదాలో చంద్రబాబు స్పష్టం చేశారట. పోనీ బిజెపితోనైనా వె ళ్లడానికి మాకు అనుమతినివ్వాలని టిటిడిపి నేతలు ఆయనను అభ్యర్థిస్తే చూద్దామంటూ దాటేశారట. గతసారి కూడా ఈ కూటమి నిజం కావడానికి ముందు చాలా మల్లగుల్లాలు చూశాం. ఇప్పుడు కూడా ఏది ఎలా వున్నా తాము బిజెపితో వుంటామని ఎన్‌డిఎ భాగస్వాములుగా అది తమ బాధ్యత అని టిటిడిపి నేతలంటున్నారు. బిజెపి ఇందుకు స్పందించకపోగా వారిలో కొందరినైనా తనవైపు ఆకర్షించాలని పాచికలు వేస్తున్నది. జిల్లాలలో వున్న టిడిపి యంత్రాంగాన్ని తమ వశం చేసుకోవచ్చన్నది బిజెపి ఆలోచనగా కనిపిస్తుంది.