తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. ఆదాయాలు పడిపోయాయి. కేంద్రం నుంచి గ్రాంట్లు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. పరిస్థితిని చెబుతూ.. తెలంగాణ సీఎం ఖర్చులను అదుపులో పెడుతున్నారు. కానీ ఏపీ సీఎం దుబారాకు అలవాటుపడుతున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే… సంక్లిష్టంగా ఉంది. ఓటాన్ అకౌంట్‌తో పోలిస్తే ఇరవై శాతం మేర అంచనాలను బడ్జెట్లో తెలగాణ సర్కార్ కోత పెట్టింది. మేనిఫెస్టోలో ప్రకటించిన రుణమాఫీ, నిరుద్యోగభృతి లాంటి కొత్త సంక్షేమ పథకాలు ఇప్పుడల్లా ప్రవేశపెట్టే అవకాశం లేదు. గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయించలేకపోతున్నామని ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టడం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. జీతాలు, పెన్షన్లకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ..ఇతర ఖర్చులన్నింటినీ తెలంగాణ సర్కార్ తొక్కి పెడుతోంది.
కొండలా అప్పులు చేసి ఖర్చు పెడుతున్న ఏపీ సీఎం..!
ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా అంతే. ఏపీ సర్కార్ జీతాలకు ఇబ్బంది పడుతున్న మాట మాత్రం బహిరంగమే. దాదాపుగా ప్రతీ నెలా.. ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయి. అభివృద్ధి పనులు ఐదు నెలల నుంచి ఏపీలో నిలిచిపోయాయి. పాత బిల్లులు చెల్లించడం లేదు. తెలంగాణ సర్కార్ ఖర్చుల మీద కాస్త అదుపు పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. కానీ ఏపీలో మాత్రం.. ముందూ వెనుకా చూసుకోని పాలన సాగుతోంది. ఏ కుటుంబ పెద్ద అయినా తన ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చు పెడతారు. అంతకు మించి ఖర్చు పెడితే..అప్పు అవుతుంది. ఆ అప్పు కొండలా పెరిగిపోతే దివాలా పరిస్థితికి వెళ్లిపోతారు. ఏపీ ప్రభుత్వానికి పెద్ద అయిన ముఖ్యమంత్రి… ముందూ వెనుకా చూసుకోకుండా అప్పులు చేస్తున్నారు. ఆదాయాన్ని పట్టించుకోకుండా… నెలవారీ ఖర్చులు పెంచుకుంటూ పోతున్నారు.
ఆదాయం… ఉద్యోగుల జీతాల్లో సగం ..!
బడ్జెట్ లెక్కల ప్రకారం… పన్నుల ఆదాయం 75వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆదాయం భారీగా తగ్గినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అదే సమయంలో… ఉద్యోగుల జీతాల ఖర్చు అమాంతం పెంచేశారు ముఖ్యమంత్రి. పదవి చేపట్టగానే 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించడంతో ఉద్యోగులు, పెన్షన్ల బిల్లు నెలకు ఐదు వేల కోట్లకు దాటిపోయింది. కొత్తగా వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జీతాలివ్వాల్సి వస్తోంది. దీనికి మరో రెండువేల కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది. ఒకటి రెండు నెలల తర్వాతైనా ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా నెలకు జీతాల బిల్లు ఎనిమిది వేల కోట్ల వరకూ అవుతుంది. అంటే… ఏడాదికి దాదాపుగా లక్ష కోట్లు. కానీ రాష్ట్ర ఆదాయం మాత్రం యాభై అరవై వేల కోట్ల మధ్యనే కనిపిస్తోంది…
పరిణామాలను అనుభవించడం ప్రారంభించిన జనం..!
దేశంపై ఆర్థిక మాంద్యం దాడి ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఆ ప్రభావం కూడా పడితే.. తెలుగు రాష్ట్రాల ఆదాయం మరింత పతనం అవుతుంది. పారిశ్రామికీకరణ పెద్దగా లేని ఏపీకి ఈ గండం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే… తెలంగాణతో పోలిస్తే.. ఏపీ సర్కార్… ప్రణాళిక లేకుండా.. పథకాల పేరుతో డబ్బు పంపిణీ చేస్తోంది. అప్పులు ఇక ఎంతో కాలం పుట్టే పరిస్థితి లేదు. ఆ పరిణామాలు ప్రజలు ఇప్పటి నుండే అనుభవించడం ప్రారంభించారు.